రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు విక్రయిస్తుంటే ఏంచేస్తున్నారని విద్యాశాఖ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ఏ చర్యలు తీసుకున్నారో వివరణ ఇస్తూ ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్, రాష్ట్రంలోని వివిధ జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం. గంగారావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
ఏపీ విద్యా సంస్థల చట్ట నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోని పలు ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ ముందడుగు ప్రజాపార్టీ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది ఎన్ఎన్ గ్రేస్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక రుసుములు వసూలు చేస్తున్నారన్నారు. ఈ వ్యాజ్యంపై తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున న్యాయవాది జె. శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ వ్యవహారంపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది.