సరస్వతి పవర్ కేసులో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(cm jagan), ఆయన భార్య భారతి వాటాలు కలిగిన సరస్వతి పవర్ సంస్థకు సున్నపురాతి మైనింగ్ లీజు పునరుద్ధరణకు అనుమతిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలు వేయడానికి అనుమతించాలని (లీవ్ పిటిషన్) ఎంపీ రఘురామకృష్ణరాజు(mp raghuramakrishnaraju) దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లో ఈ మేరకు నోటీసులు జారీచేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు నోటీసులు జారీచేసిన వారిలో సరస్వతి పవర్, ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌పీఐపీఎల్) డైరెక్టర్ ఆదిరాజు వేణుగోపాలరాజు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, గనుల శాఖ డైరెక్టర్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి ఉన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. సరస్వతి పవర్ విషయంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీలు చేశారు. 2019 అక్టోబరు 15న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలన్నారు. ఎస్‌పీఐపీఎల్‌కు మైనింగ్ లీజును పునరుద్ధరిస్తూ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి 2019 డిసెంబరు 12న ఇచ్చిన జీవో 109, ఆ సంస్థకు నీటి కేటాయింపు జీవో, మైనింగ్ లీజును 30 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పొడిగిస్తూ ఇచ్చిన జీవోల అమలునూ నిలుపుదల చేయాలని కోరారు.