టెండర్ల పరిశీలన వ్యవహారంలో న్యాయశాఖను బైపాస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాన్ని తీసుకొచ్చినట్లుందని హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు న్యాయశాఖ, కార్యదర్శి ఉన్నారు కదా అని ప్రశ్నించింది. జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం ముసుగులో న్యాయశాఖ అధికారాలను బైపాస్ చేయడానికి వీలు లేదంది. ప్రభుత్వ బిజినెస్ నిబంధనలను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
ఆ పని న్యాయశాఖది కదా..
టెండర్లను ఖరారు చేసే ముందు నిబంధనలు సక్రమంగా ఉన్నాయా.. లేదా అనే అంశాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జ్యుడీషియల్ ప్రివ్యూ(ముందస్తు పరిశీలన) చట్టం-2019ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ తిరుపతికి చెందిన వ్యాపారి వై.విద్యాసాగర్ గతేడాది హైకోర్టులో పిల్ వేశారు. ఆయన తరఫు న్యాయవాది డీఎస్‌ఎన్‌వీ ప్రసాదబాబు వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలో జ్యుడీషియల్ రివ్యూ ప్రస్తావన ఉందికానీ. ప్రివ్యూ గురించి లేదని ఆ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ.. న్యాయశాఖను బైపాస్ చేయలేదని, రూ.100 కోట్ల విలువ పైబడిన టెండర్లలో పారదర్శకత కోసమే ప్రివ్యూ ఏర్పాటు చేశారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. టెండర్ నిబంధలను సక్రమంగా ఉన్నాయా లేవా చూడాల్సింది, అభిప్రాయం ఇవ్వాల్సింది న్యాయశాఖ కదా అని ప్రశ్నించింది. న్యాయశాఖ విధులను బైపాస్ చేసి జ్యుడీషియల్ ప్రివ్యూని ఏర్పాటు చేసినట్లుందని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశించింది.
ఇదీ చదవండి:నేడు ఒడిశా సీఎంతో జగన్ భేటీ