రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది: హైకోర్టు
15:11 April 25
ధార్మిక పరిషత్‌లో సభ్యుల సంఖ్యను తగ్గించడంపై హైకోర్టు ఆగ్రహం
AP High Court on Dharmika Parishad Members: ధార్మిక పరిషత్‌లో సభ్యుల సంఖ్యను తగ్గించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. ధార్మిక పరిషత్‌లో సభ్యుల సంఖ్యను కుదిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పాలెపు శ్రీనివాసులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ధార్మిక పరిషత్‌లో 21 మంది సభ్యులు ఉండాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని.. సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సభ్యుల సంఖ్యను 21 నుంచి నలుగురికి కుదించారని.. ఆ నలుగురు కూడా అధికారులేనని కోర్టుకు తెలిపారు. దీనిపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం.. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా ఎలా సభ్యులను కుదిస్తారని.. ఏ ప్రాతిపదికన ఇలా చేశారని ప్రశ్నించింది. నలుగురినే నియమించడం సుప్రీం తీర్పును అమలు చేసినట్లు కాదు కదా అని అసహనం వ్యక్తం చేసింది. తితిదే పిటిషన్లతో కలిపి విచారించే విధంగా పోస్టింగ్ వేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం పిటిషన్లపై విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి:యూటీఎఫ్ "చలో సీఎంవో".. ఎక్కడికక్కడ పోలీసుల తనిఖీలు.. సామాన్యులకు ఇబ్బందులు