రియాల్టీ షోల పేరుతో ఏదైనా ప్రదర్శిస్తామంటే ఊరుకునేది లేదని హైకోర్టు హెచ్చరించింది. ఇలాంటి వాటి విషయంలో తాము కళ్లుమూసుకుని ఉండలేమని వ్యాఖ్యానించింది. రియాల్టీ షోలలో హింసను ప్రోత్సహిస్తూ.. దాన్ని సంస్కృతి అని ఎలా చెబుతారని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని భావిస్తే.. సీజే బెంచ్ ముందు ప్రస్తావించే వెసులుబాటును పిటిషనర్‌కు వదిలేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. బిగ్‌బాస్ షో.. అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేదిగా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి ఇటీవల కోరడంతో అంగీకరించిన ధర్మాసనం.. సోమవారం విచారణ జరిపింది. ‘సరైన కారణం కోసం పిటిషనర్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. రియాల్టీ షో పేరుతో ఏదైనా చూపిస్తామంటే ఊరుకునేది లేదు’ అని వ్యాఖ్యానించింది. సీనియర్ న్యాయవాది స్పందిస్తూ.. ఈ వ్యాజ్యం 2019లో దాఖలైందని, పిటిషనర్ తరఫు న్యాయవాది అత్యవసర విచారణ కోసం పది రోజుల కిందట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర బెంచ్ ముందు అభ్యర్థించారన్నారు. సీజే నేతృత్వంలోని ధర్మాసనం అనుమతించలేదన్నారు.