రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి హైకోర్టుకు నివేదించారు. పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు సందర్భాల్లో పలువుర్ని అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్న ఘటనల్లో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరుపుతోంది.
పోలీసుల అనుమతితో కార్యక్రమాలు చేపడుతున్నా నిరసనకారులను అరెస్టు చేస్తున్నారని ఈ విచారణలో భాగంగా ఆమె.. కోర్టు దృష్టికి తెచ్చారు. రాజధానిగా అమరావతి కొనసాగింపు కోసం ఉద్యమిస్తున్న వారిని భయాందోళనకు గురి చేసేందుకు మందడం గ్రామంలో మొదట్లో సుమారు వెయ్యి మంది పోలీసులు కవాతు చేశారని గుర్తు చేశారు. హైకోర్టు జోక్యంతో అలాంటి చర్యలు తగ్గినా పోలీసు దౌర్జన్యం జరుగుతూనే ఉందని చెప్పారు. రాజధాని తరలింపును నిరసిస్తూ మందడం గ్రామంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పోటీగా సమీపంలో మూడు రాజధానులకు మద్దతుగా దీక్ష నిర్వహించేందుకు పోలీసులు అనుమతిచ్చారని తెలిపారు. పోలీసుల అనుమతితో రాజధాని ప్రాంతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బస్సుయాత్ర చేపట్టగా.. ఆ కార్యక్రమానికి ఆటంకం కలిగించేందుకు పోలీసులు కొంతమందికి అనుమతిచ్చారని పేర్కొన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వం తరఫున పూర్తి వాదనలను వినిపించేందుకు విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
బాధితులకు న్యాయం ఏవిధంగా అందించగలం: ధర్మాసనం