వైఎస్ వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలంటూ... వివేకా కుమార్తె సునీత, భార్య సౌభాగ్యమ్మతో పాటు తెలుగుదేశం నేత బీటెక్ రవి, భాజపా నేత ఆదినారాయణరెడ్డి వేసిన పిటిషన్లపై... హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. కేసు దర్యాప్తులో అనేక అనుమానాలున్నాయని... పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. రాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 5 గంటల మధ్య వివేకా హత్య జరిగిందని... మరుసటి రోజు ఉదయం 6 గంటల 30 నిమిషాలకే కడప MP అవినాష్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారని వివరించారు. అవినాష్‌రెడ్డి సహా మరికొందరు ఆధారాలు చెరిపివేశారని పేర్కొన్నారు. హత్యపై తొలుత 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని... మృతదేహం రక్తపుమడుగులో పడి ఉండటం, ఒంటిపై గాయాలున్నప్పటికీ సహజమరణమని చెప్పారని తెలిపారు. గుండెపోటుతో వివేకా మరణించారంటూ సాక్షి టీవీలోనూ ప్రసారం చేశారని న్యాయస్థానానికి నివేదించారు. వివేకా హత్యపై 3సిట్ బృందాలు ఏర్పాటు చేసినప్పటికీ దోషులెవరో తేల్చలేదని న్యాయవాదులు పేర్కొన్నారు. సిట్ అధికారులు కూడా స్థానిక పోలీసులు ఇచ్చిన సమాచారాన్నే నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినా... తర్వాత వారినీ విడుదల చేశారని తెలిపారు. కేసును సీబీఐకి అప్పగిస్తేనే దోషుల గుర్తింపు సాధ్యమవుతుందని ధర్మాసనాన్ని కోరారు.
వివేకా హత్యకేసు విచారణలో ఇప్పటివరకూ జరిగిన విచారణ లోపభూయిష్ఠమని... బీటెక్ రవి తరఫు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదించారు. ఉదయాన్నే రావాలని డ్రైవర్‌కు చెప్పడం వల్లే గొడవ తలెత్తి హత్య జరిగిందని సూసైడ్ లెటర్‌లో ఉండటాన్ని చూస్తే... కేసును పక్కదారి పట్టించేందుకే అలా చేసి ఉంటారని వివరించారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్... ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని కోరారని గుర్తుచేశారు. సీఎం అయ్యాక తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్న విషయాన్ని ప్రస్తావించారు.