Narayana bail petition: సీఆర్డీఏ చట్టం ప్రకారం రాజధాని అమరావతి నిర్ణయాల విషయంలో అధికారులకు, ప్రభుత్వానికి ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ ఉన్నప్పుడు సీఐడీ పెట్టిన కేసు ఎలా చెల్లుతుందని హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని.. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం ఆదేశాలిచ్చారు. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్మెంట్ విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది.
ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం మాజీ మంత్రి నారాయణ, రామకృష్ణ హౌసింగ్ డైరెక్టర్ కె.పి.వి.అంజనీకుమార్, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, ఆయన సోదరుడు రాజశేఖర్ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై గురువారం విచారణ ప్రారంభం కాగానే సీఐడీ తరఫు న్యాయవాది చైతన్య స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాలపై అదనపు ఏజీ వాదనలు వినిపించేందుకు విచారణను వారంరోజులు వాయిదా వేయాలని కోరారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా కోరారు కదా అని న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. ముందస్తు బెయిలు పిటిషన్ల విషయంలో నిర్దిష్ట సమయంలో విచారణ జరపాల్సి ఉందన్నారు.
భూములివ్వడమే మా పాపమా?:పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. అమరావతిలో భూములుండటం, రాజధాని కోసం భూములివ్వడమే పాపంలా, నేరంలా ఉందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూసేకరణే జరగలేదు.. నిర్మాణమూ చేపట్టలేదు.. అలాంటప్పుడు అనుచిత లబ్ధి పొందడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాజధాని విషయంలో నిర్ణయాలకు సీఆర్డీఏ చట్టం నుంచి రక్షణ ఉందన్నారు. ఆ చట్టంలోని సెక్షన్ 146 ప్రకారం ప్రభుత్వాన్ని, అధికారులను విచారించకుండా నిషేధం ఉందని వివరించారు. పిటిషనర్లను వేధించడం కోసమే సీఐడీ కేసు నమోదు చేసిందని ఆరోపించారు.