సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకి) నుంచి రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి తెదేపా సీనియర్ నేత పయ్యావుల కేశన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సెకీ, ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్, విద్యుత్ పంపిణీ సంస్థలు, ఏపీఈఆర్సీ, సీఈఆర్సీలకు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది. స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్ రెడ్డి అభ్యర్థించగా.. వాణిజ్య సంబంధ వ్యవహారంలో తాము తక్షణం జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. ఈ వ్యవహారాలు భారీ పెట్టుబడులతో ముడిపడి ఉంటాయని తెలిపింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి యూనిట్ ధర రూ. 2.49 పైసల చొప్పున 7 వేల మెగా వాట్ల సౌర విద్యుతు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్ధారించడాన్ని సవాలు చేస్తూ తెదేపా సీనియర్ నేత పయ్యావుల కేశవ్ హైకోర్టులో పిల్ వేశారు. సౌర విద్యుత్ తాత్కాలికంగా సమకూర్చుకునేందుకు ఏపీఈఆర్సీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు కేబినెట్ ఆమోదించడాన్ని చట్ట విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి.. సౌర విద్యుత్ కొనుగోలు వ్యవహారం, సోలార్ విద్యుత్ ప్యానెళ్ల తయారీ విషయం వేర్వేరు అన్నారు. రెంటిని మిళితం చేసి ధరను నిర్ణయించారన్నారు. ప్యానళ్ల తయారీ విద్యుత్ చట్ట పరిధిలోకి రాదన్నారు.
'సెకి' వ్యవహారంపై స్టేటస్‌కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ - hc on Seci purchases affair
APHC On SECI: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి స్టేటస్‌కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వాణిజ్య సంబంధ వ్యవహారంలో తాము తక్షణం జోక్యం చేసుకోలేమంది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే ఈ కొనుగోళ్లపై కౌంటర్ల దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
సెకీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ రెండు రూపాయల 49 పైసల చొప్పున కొనుగోలు చేయబోతోందన్నారు . బహిరంగ మార్కెట్లో యూనిట్ రెండు, అంతకన్నా తక్కువకు దొరుకుతుందన్నారు. సీఈఆర్ సీ ఆదేశాల నేపథ్యంలో ప్రక్రియ ముందుకు సాగుతోందని.. యథాతథ స్థితి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాణిజ్య సంబంధ వ్యవహారంలో తాము తక్షణం జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. ఇదే వ్యవహారంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరో పిల్ దాఖలు చేశారంటూ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ వ్యాజ్యంతో కలిపి ప్రస్తుత పిల్‌ను విచారిస్తామని పేర్కొన్న ధర్మాననం.. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి:జగన్ పాలనలో ఆస్తులకు, ఆడబిడ్డలకు, ప్రాణాలకు రక్షణ లేదు: చంద్రబాబు