స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ తరపున న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. హైకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించామన్నారు. సంప్రదింపుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించామన్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణ నిమిత్తం నవంబర్ 17న జారీ చేసిన ప్రొసిడింగ్స్ అమలును నిలుపుదల చేయవద్దని కోరారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర లేదని చెప్పారు. ఎస్ఈసీపై రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం కలిగి ఉండాలని కర్ణాటక హైకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి: ఏజీ
ప్రభుత్వం తరపు, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. కానీ ఎస్ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహించలేమని చెప్పారు. కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం ముఖ్యమని.. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని ప్రొసీడింగ్స్ అమలును నిలుపుదల చేయాలని కోరారు. ప్రస్తుతం ఎస్ఈసీ నిర్ణయం హేతుబద్ధంగా ఉందా..? లేదా...? అనే విషయాన్ని పరగణనలోకి తీసుకొని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.