అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ తుళ్లూరు మండలం విశ్రాంత తహశీల్దార్ అన్నె సుధీర్ బాబు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని తన వద్ద నుంచి బదిలీ చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులిచ్చారు. ఈ వ్యాజ్యం వేరే న్యాయమూర్తి వద్దకు విచారణకు వచ్చేలా నిర్ణయం తీసుకునే నిమిత్తం ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తికి నివేదించాలని రిజిస్ట్రీని ఆదేశించారు. సుధీర్ బాబు పిటిషన్ పై ఇటీవల వాదనలు పూర్తయి న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు.
తాజాగా ఆ వ్యాజ్యాన్ని వేరే బెంచ్‌కు బదిలీ చేశారు. అసైన్డ్ భూములను కొందరికి కట్టబెట్టే వ్యవహారంలో అప్పటి తహశీల్దార్ సుధీర్ బాబు పాత్ర ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించగా .. దర్యాప్తుపై స్టే విధించింది. ఆ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ... సుధీర్ బాబు పిటిషన్‌పై విచారణ జరిపి త్వరగా తేల్చాలని హైకోర్టును ఆదేశించిన విషయం తెలిసిందే.
ఆ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి:హైకోర్టు
నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామ పరిధిలో దామోదర సంజీవయ్య ధర్మల్ పవర్ ప్లాంట్‌లో యాష్ పాండ్ ఏర్పాటు విషయమై టెండర్లు పిలవకుండా 56.50 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనుల్ని నామినేషన్ ఆధారంగా అప్పగించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. టెండర్లు పిలవకుండా కాంట్రాక్ట్ పనులు అప్పగించడం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు విరుద్ధమని స్పష్టంచేసింది. బాధ్యులైన అధికారులపై ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపి 2021 జనవరి 25 లోపు నివేదిక ఇవ్వాలని లోకాయుక్తను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి , జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. టెండర్లు పిలవకుండా రూ . 56. 50 కోట్లతో రెండో యాష్ పాండ్ నిర్మిస్తున్నారని పేర్కొంటూ ముత్తుకూరు మండలం మసునూరువారిపాలేనికి చెందిన డి. రామసుబ్బారెడ్డి, మరో ఇద్దరు 2018 ఆగస్టులో హైకోర్టులో పిల్ వేశారు.
తాజాగా పిటిషన్ పై జరిగిన విచారణలో పిటిషనర్ల తరపు న్యాయవాది బొబ్బిలి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఏపీ పవర్ డెవలప్మెంట్ కంపెనీ ఆధ్వర్యంలోని దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో యాష్ పాండ్ నిర్మాణానికి టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఏఎంఆర్, వై హెల్తర్ జాయింట్ వెంచర్ కంపెనీకి 56.50 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అప్పగించారని పిటీషనర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. బహిరంగ టెండర్లు పిలవకుండా నామినేషన్ ఆధారంగా కాంట్రాక్ట్ ఇచ్చారు అని కోర్టుకు తెలిపారు. ఏపీ పవర్ డెవలప్ మెంట్ కంపెనీ లిమిటెడ్ తరపున న్యాయవాది ఓ.మనోహర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ... వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేశామన్నారు. అదనపు పనిని మాత్రమే అప్పగించామన్నారు. విచారణను వారం రోజులకు వాయిదా వేయాలన్నారు. ఆ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం .. రూ.56.50 కోట్ల కాంట్రాక్ట్ ను టెండర్లు పిలవకుండా ఎలా అప్పగిస్తారని ప్రశ్నించింది. ఈ విషయంలో నిధుల దుర్వినియోగం , అవినీతి చోటు చేసుకున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. విచారణ జరపాలని లోకాయుక్తను ఆదేశించింది.
సభ్యుల కుదింపుపై కౌంటర్ దాఖలకు ఆదేశం
రాష్ట్ర, జిల్లా స్థాయిలోని మీడియా అక్రిడియేషన్ కమిటీల్లో గుర్తింపు పొందిన పాత్రికేయ సంఘాల సభ్యుల్ని కుదింపుపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సాధారణ పరిపాలనశాఖ ప్రధాన కార్యదర్శి, సమాచార, పౌరసంబంధాలశాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
అక్రిడియేషన్ కమిటీలో సభ్యులు కుందింపునకు సంబంధించి ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 15 న జారీచేసిన జీవో 98ని సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్ట్ ఫోరం ప్రధాన కార్యదర్శి ఎం . కృపావరం హైకోర్టులో పిల్ వేశారు. ఆయన తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ .. ' గతంలో గుర్తింపు పొందిన జర్నలిస్ట్ సంఘాల నుంచి అక్రిడియేషన్ కమిటీలో ఐదుగురుకి స్థానం ఉండేది. తాజాగా ఆ నిబంధనను సవరించి ఇద్దరికే స్థానం కల్పించారు. త్వరలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయబోతోంది. తగిన ఉత్తర్వులు ఇవ్వండి అని కోరారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేశాక మధ్యంతర ఉత్తర్వులిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి:పీఎంఏవై ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకివ్వలేదు..?:హైకోర్టు