పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల్ని జూన్ 16న శాసనసభలో తిరిగి ప్రవేశపెట్టడం, శాసనమండలి రద్దుకు శాసనసభ చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాల్ని త్రిసభ్య ధర్మాసనానికి హైకోర్టు నివేదించింది. సంబంధిత ఫైళ్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ముందు ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. బిల్లుల్ని ఓ సారి సెలెక్టు కమిటీకి సిఫారసు చేశాక మళ్లీ శాసనసభలో ఎలా పెడతారని ప్రశ్నిస్తూ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలక్టు కమిటీకి పంపకపోవడాన్ని సవాలు చేస్తూ గతంలోనూ ఓ వ్యాజ్యం దాఖలు చేశారు. మరోవైపు ఏపీ శాసన మండలిని రద్దు చేయాలని పార్లమెంట్‌ను విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యాజ్యాలన్నింటిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు. ఈ అంశంతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలు సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరుపుతున్న నేపథ్యంలో ప్రస్తుత వ్యాజ్యాలను కూడా అక్కడే విచారణ జరపాలని న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ .. ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 14 లోపు విచారణ జరిపి నిర్ణయం వెల్లడించకపోతే తాము దాఖలు చేసిన వ్యాజ్యాలు నిరర్థకం అవుతాయన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. ఫైళ్లను తక్షణం సీజే ముందు ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.