సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన రాజద్రోహం కేసుపై ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రాజద్రోహం సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్ల కింద రఘురామను సీఐడీ అధికారులు విచారించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని దిల్ కుశ గెస్ట్ హౌస్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని తెలిపింది.
న్యాయవాది సమక్షంలో మాత్రమే విచారించాలని ఉత్తర్వుల్లో తెలిపింది. హైకోర్టు ఆదేశాలను పోలీసులు అతిక్రమిస్తే వారిపై క్రమశిక్షణారాహిత్య చర్యలుంటాయని స్పష్టం చేసింది. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎంపీ వ్యాఖ్యలు చేశారంటూ.. సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసింది. రాజద్రోహం ఐపీసీ 124, 153ఏ, 505, 120బి సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది.
హైకోర్టులో విచారణ సందర్భంగా.. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాజద్రోహం(ఐపీసీ 124ఏ) చట్టాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన నేపథ్యంలో పిటిషనర్‌పై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన మిగిలిన సెక్షన్ల విషయంలో దర్యాప్తు పేరుతో పిలిచి ఇబ్బందులకు గురిచేయకుండా నిలువరించాలని కోరారు. పిటిషనర్ ఏదైనా పర్యటనకు సిద్ధమవుతున్న సమయంలో దానిని అడ్డుకోవడం కోసం ఉద్దేశ పూర్వకంగా సీఐడీ నోటీసులిచ్చి హాజరుకావాలని కోరుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని, అభిప్రాయాలను వ్యక్తం చేస్తే రాజద్రోహం కింద సీఐడీ సుమోటోగా కేసుపెట్టడం సరికాదని వాదనలు వినిపించారు.
మరోవైపు సెక్షన్ 124(ఏ) అమలును సుప్రీంకోర్టు ఇటీవల నిలుపుదల చేసిన నేపథ్యంలో ఆ సెక్షన్ విషయంలో తాము ముందుకెళ్లబోమని ప్రభుత్వం తరపున ఏజీ తెలిపారు. మిగిలిన సెక్షన్ల వ్యవహారంలో దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. పిటిషనర్ దర్యాప్తునకు సహకరించేలా ఆదేశించాలన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
ఇదీ చదవండి: