ఏపీ ధార్మిక పరిషత్ కమిటీ సభ్యులను నలుగురికి కుదిస్తూ.. దేవాదాయ చట్టానికి సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎండోమెంట్ కమిషనర్, ఏపీ ధార్మిక పరిషత్ సభ్య కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఆ వ్యాజ్యాన్ని పెండింగ్లోనే..
సవరణ చట్టం ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది పీవీజీ ఉమేశ్చంద్ర అభ్యర్థించగా.. వ్యాజ్యాన్ని పెండింగ్లోనే ఉంచుతున్నామని.. కౌంటరు దాఖలు చేశాక పరిశీలిస్తామని న్యాయస్థానం స్పష్టంచేసింది. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. అనుబంధ పిటిషన్ను పెండింగ్ లోనే ఉంచింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదే శాలిచ్చింది.
ప్రతివాదులకు నోటీసులు జారీ..
ఏపీ ధార్మిక పరిషత్ కమిటీ సభ్యులను కుదిస్తూ దేవాదాయ చట్టానికి సవరణ చేశారని, దానిని రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన పాలెపు శ్రీనివాసులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దేవాదాయ చట్టంలోని సెక్షన్ 152 ప్రకారం ధార్మిక పరిషత్లో 21 మంది సభ్యులుగా ఉండాలన్నారు. తాజాగా తెచ్చిన సవరణ చట్టం ద్వారా దేవాదాయ శాఖ మంత్రి ఛైర్మన్గా, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, ఎండోమెంట్ కమిషనర్, తితిదే కార్యనిర్వహణ అధికారి సభ్యులుగా పేర్కొన్నారన్నారు. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం అన్నారు. సవరణ చట్టం రాజ్యాంగంలోని అధికరణ 25 , 26 కు వ్యతిరేకం అన్నారు. దేవాదాయ ప్రధాన చట్టంలోని మౌలిక సూత్రాలకు విరుద్ధంగా చట్ట సవరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.
ఇదీ చదవండి: YSR Rythu Bharosa: 'వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్' నిధుల విడుదల