AP HIgh Court News: గుంటూరు జిల్లా మంగళగిరిలోని గండాలయపేటకు చెందిన మెడబలిమి మనోజ్ తన మూడు నెలల చిన్న కుమార్తెను రూ. 70 వేలకు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కొండప్రోలు గ్రామానికి చెందిన గాయత్రికి విక్రయించారు. తర్వాత ఆ చిన్నారి ఆరుగురి చేతులు మారాక చివరిగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రమేశ్.. ఆ శిశువును రెండున్నర లక్షలకు కొనుగోలు చేశారు. చిన్నారి తల్లి ఫిర్యాదుతో అసలు విషయం బయటపడిన వ్యవహారంపై పత్రికల్లో మార్చి 30న వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకొని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ జె.రామకృష్ణ ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం పిల్‌గా మలచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని మానవ అక్రమ రవాణాగా పరిగణించాలని పేర్కొంది.
అంగన్వాడీ టీచర్ కూపీ లాగడంతో: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లికి చెందిన చిలకమ్మ అనే మహిళ తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చారు. ఆమెకు తెలియకుండా భర్త, అత్త.. ఆ శిశువును విక్రయించారు. అంగన్వాడీ టీచర్ కూపీ లాగడంతో బిడ్డను విక్రయించిన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. వాటిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి , జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వడ్డిబోయిన సుజాతతో కూడిన జునైనల్ జస్టిస్ కమిటీ స్పందించింది. సుమోటో పిల్‌గా మలచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.