ఏపీలో ప్రజాప్రతినిధులపై ఉన్న పలు కేసులకు సంబంధించి అప్పీల్స్ ను ప్రత్యేక కోర్టుల్లో విచారణ చేయవచ్చా.. అనే అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎంపీ, ఎమ్మెల్యేలకు కింది కోర్టుల్లో ఇచ్చిన తీర్పుపై వారు అప్పీల్ వేసుకున్నారు. ఆ అప్పీల్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుల్లో విచారణ చేయవచ్చా అని విజయవాడ ప్రత్యేక కోర్టు జడ్జి.. కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ జడ్జికి లేఖ రాశారు. సీఆర్పీసీ ప్రకారం జిల్లా ప్రిన్సిపల్ జడ్జి హైకోర్టుకు నివేదించారు. ఇదే అంశం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ప్రభుత్వ న్యాయవాది సమయం కావాలని కోరారు. తదుపరి విచారణను ఈనెల 15 కి న్యాయస్థానం వాయిదా వేసింది.
నేపథ్యం..
2017 డిసెంబరులో సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా విజయవాడలోనూ న్యాయస్థానం ఏర్పాటైంది. దీంతో ఎంపీలు, ఎమ్మెల్యేలపై రాష్ట్రంలో ఉన్న కేసులన్నీ ప్రత్యేక కోర్టుకు చేరాయి. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలపై 2008, 2011, 2014లలో నమోదైన నాలుగు కేసులను దిగువ కోర్టులు విచారణ చేసి తీర్పులిచ్చాయి.