వైఎస్ఆర్ జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు వరదలకు తెగిపోయిన ఘటనలో బాధితులకు తగిన పరిహారం అందజేయడానికి, డ్యాం కొట్టుకుపోవడానికి బాధ్యులు ఎవరో తేల్చేందుకు విశ్రాంత ఇంజినీర్లతో కమిటీని వేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆర్.గోపాలకృష్ణ హైకోర్టును కోరారు. మరోవైపు ఈ వ్యవహారంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో అఫిడవిట్ వేసినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్ కోర్టుకు తెలిపారు. సంబంధిత దస్త్రం కోర్టు రికార్డుల్లో చేరకపోవడంతో విచారణను జులై 4కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. అన్నమయ్య ప్రాజెక్టు 2021 నవంబరులో కొట్టుకుపోవడంలో అధికారుల వైఫల్యం ఉందని, బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ భాజపా నాయకులు ఎన్.రమేశ్‌నాయుడు హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే.
25 మంది మృతి... 8 మంది ఆచూకీ గల్లంతు:ప్రకృతి విపత్తు కారణంగానే డ్యాం తెగినట్లు జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు అఫిడవిట్ దాఖలు చేశారు. ‘పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదు. ప్రాజెక్టు గత చరిత్రను పరిశీలిస్తే 3 నుంచి 4 ఏళ్లకు ఓసారి మాత్రమే నిండుతుంది. 2020, 2021 సంవత్సరాల్లో ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద నీరు చేరింది. తాజా ఘటనలో గంటకు ఒక టీఎంసీ నీరు చేరడంతో రిజర్వాయరు పూర్తిగా నిండింది. నీటి భారీ ప్రవాహంతో ఎర్త్‌బండ్ తెగిపోయింది. అది ప్రకృతి విపత్తుతో సంభవించిందేగానీ... డ్యాం నిర్వహణలో విఫలంతో కాదు. 2020 నవంబరులో వచ్చిన నివర్ తుపాను కారణంగా ప్రాజెక్టు 3, 4, 5 గేట్ల బీమ్‌లు దెబ్బతిన్నాయి. 3, 4 గేట్ల బీమ్‌లను తక్షణం పునరుద్ధరించాం. 5వ గేటుకు భారీగా మరమ్మతులు చేయాల్సి వచ్చింది.