ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీవోలో 'ముస్లిం యూత్​' అని ఎలా ప్రస్తావిస్తారు?: హైకోర్టు - జీవో 776పై హైకోర్టు సీరియస్ కామెంట్స్ తాజా వార్తలు

కేసుల విచారణ ఉపసంహరణ విషయంలో ‘ముస్లిం యూత్‌’ అని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. సామాజికవర్గం వివరాలను జీవోలో పేర్కొనడం రాజ్యాంగ పీఠికకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం ఇది లౌకిక రాష్ట్రమేనా? అని ప్రశ్నించింది. ఆ జీవో ప్రాసిక్యూషన్‌ ఉపసంహరణ కోసం ఇచ్చినట్లు లేదని.. కేవలం రాజకీయ లబ్ధి పొందేందుకు జారీ చేసినట్లు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ముస్లిం సామాజికవర్గం మొత్తాన్ని ఎలా సాధారణీకరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ప్రభుత్వాన్ని నడుపుతోంది ఇలానా అని ప్రశ్నించింది. ఓట్లు పొందే ఉద్దేశంతో ఏ ప్రభుత్వమూ ఇలా వ్యవహరించడానికి అనుమతించేది లేదని తేల్చిచెప్పింది.

ap high court fires on go 776
ap high court fires on go 776

By

Published : Sep 25, 2020, 4:49 AM IST

పాత గుంటూరు ఠాణాపై దాడి కేసులో ముస్లిం యువకులపై నమోదైన ఆరు ఎఫ్‌ఐఆర్‌లలో ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించేందుకు హోంశాఖ ఈ ఏడాది ఆగస్టు 12న జారీ చేసిన జీవో 776ను హైకోర్టు సస్పెండు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ల విషయంలో యథాతథ స్థితిని పాటించాలని అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, గుంటూరు ఎస్పీ, పాతగుంటూరు ఠాణా ఎస్‌హెచ్‌వోలకు నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యంలో ఇప్పటికే సీబీఐ ప్రతివాదిగా ఉండగా.. జాతీయ దర్యాప్తు సంస్థనూ ప్రతివాదిగా చేర్చాలని పిటిషనరుకు మౌఖికంగా సూచించింది. విచారణను అక్టోబరు 1కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

2018 మే 15న పాతగుంటూరు ఠాణాపై దాడి చేసి, పోలీసులను గాయపరిచిన ఘటనలో ముస్లిం యువకులపై నమోదైన కేసులను డీజీపీ ఆదేశాలతో ఉపసంహరించుకునేందుకు ఇచ్చిన జీవో 776ను రద్దుచేయాలని కోరుతూ పసుపులేటి గణేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో జీవోను పరిశీలించిన ధర్మాసనం.. ‘ముస్లిం యూత్‌’ అని పేర్కొనడంపై ఆగ్రహించింది. ఆ పదాలను ప్రస్తావించడంపై నిలదీసింది. జీవో తప్పుడు ఉద్దేశాన్ని సూచిస్తోందని తెలిపింది. దర్యాప్తును స్వతంత్ర సంస్థకు మార్చేందుకు డీజీపీ ఉద్దేశం చాలంటూనే ఇకపై ఇలా వ్యవహరించొద్దని హోంశాఖకు, డీజీపీకి సలహా ఇవ్వాలని జీపీకి సూచించింది.

ఇదీ చదవండి:వివేకా హత్యకేసు: సెటిల్​మెంట్లు, స్థిరాస్తి గొడవలపై సీబీఐ ఆరా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details