సర్పంచ్ సీట్ల విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని.. జాబితాలో ఓటర్‌గా పేరు లేకపోవటంతో పోటీ చేసే అవకాశం కోల్పోవాల్సి వస్తోందని తదితర అభ్యంతరాలతో శుక్రవారం హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 2000 సంవత్సరంలో సుప్రీం తీర్పు ప్రకారం.... ఓసారి ఎన్నికల ప్రకటన జారీ అయ్యాక కోర్టు జోక్యం చేసుకునే అంశాలు చాలా తక్కువని ఓ పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. పిటిషనర్ కు భారత ఎన్నికల సంఘం గతంలో ఇచ్చిన ఓటరు గుర్తింపు కార్డు ఉందని... ప్రస్తుత జాబితాలో ఓటరుగా పేరు లేదని కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుని ఓటరుగా అవకాశం ఇవ్వాలని ఆదేశించొచ్చన్నారు. దానివల్ల ఎన్నికల ప్రక్రియకు అవరోధం ఉండదన్నారు. మరికొందరి పిటిషనర్ల తరఫు వాదించిన మరో న్యాయవాది.. 2019 జాబితా ప్రకారం ఎన్నికలు జరిగితే 3.6 లక్షల మంది ఓటు హక్కు కోల్పోతారని.... అర్హుల పేర్లు జాబితాలో చేర్చేవరకూ సంబంధిత గ్రామాల్లో ఎన్నికలు నిలువరించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వొకేట్ జనరల్.. అన్ని సందర్భాల్లో న్యాయస్థానం జోక్యంపై నిషేధమేమీ లేదన్నారు. ఎన్నికల ప్రక్రియను నిలువరించకుండా పరిమిత విషయాల్లో జోక్యం చేసుకోవచ్చన్నారు. ఎస్ఈసీ తరఫున వాదించిన అశ్వనీకుమార్..... నిబంధనల ప్రకారం ఓటు హక్కు వచ్చినవారు పేరు నమోదు చేసుకోవాలన్నారు. సీఈసీ తయారు చేసిన ఓటరు జాబితాను ఎస్ఈసీ పాటిస్తుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక న్యాయస్థానాల జోక్యానికి వీల్లేదన్నారు. సహేతుకమైన సమయంలో ఓటర్ జాబితాను తయారు చేయకపోతే.. అంతకముందు సిద్ధం చేసిన జాబితా ప్రకారం ఎన్నికల నిర్వహించొచ్చని..... గతంలోని సుప్రీం తీర్పును ఉదహరించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు... అనుబంధ వ్యాజ్యాలను కొట్టివేసింది.