తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు డీసీసీబీ రిటైర్డ్ ఇంఛార్జి మేనేజర్ నరసింహమూర్తిని అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. లంపకలోవ సొసైటీలో అవకతవకలు జరిగాయని నరసింహమూర్తిపై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అతను హైకోర్టును ఆశ్రయించారు. నరసింహమూర్తిపై తదుపరి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు పిటిషనర్‌ను అరెస్టు చేశారని ఆయన తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపించారు. న్యాయస్థానం ఉత్తర్వులను వాట్సప్ ద్వారా సంబంధిత పోలీసు అధికారులకు పంపామని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీకి న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.