ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యువ న్యాయవాదులు సహనం అలవరుచుకోవాలి: హైకోర్టు సీజే

యువ న్యాయవాదులు వృత్తిలో విజయం సాధించాలంటే అపారమైన సహనం ఉండాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి అన్నారు. అనంతపురం జిల్లా కోర్టు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. యువ న్యాయవాదులకు దిశానిర్దేశం చేశారు.

అనంతపురం కోర్టుకు వందేళ్లు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి

By

Published : Mar 28, 2021, 4:16 AM IST

Updated : Mar 28, 2021, 5:20 AM IST

న్యాయవాద వృత్తి అంటే టీ20, వన్డే క్రికెట్‌ మ్యాచ్‌ లాంటిది కాదని.. టెస్టు క్రికెట్‌లా ఓపిక పడితేనే ఈ వృత్తిలో విజయం సాధించగలరని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి యువ న్యాయవాదులకు సూచించారు. కష్టానికి ప్రత్యామ్నాయం, విజయానికి అడ్డదారులు ఉండవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అనంతపురం జిల్లా కోర్టు ఏర్పాటు చేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం నిర్వహించిన శతాబ్ది వేడుకల్లో సీజే ప్రసంగిస్తూ సామాజిక న్యాయమే అత్యున్నత న్యాయమని పేర్కొన్నారు.

బలహీనవర్గాల పక్షాన నిలబడాలని, అక్షరజ్ఞానం లేనివారిపట్ల సున్నితంగా వ్యవహరించాలన్నారు. తాను న్యాయవాద వృత్తి ప్రారంభించిన రోజుల్లో సీనియర్లు ఎంతగానో సహకరించారన్నారు. యువ న్యాయవాదులు వృత్తి ప్రారంభంలో అవకాశాల్లేక తమ నైపుణ్యం వృథా అవుతుందని ఆందోళనకు గురవుతున్నారని, అవన్నీ తాత్కాలిక సమస్యలేనని అర్థం చేసుకోవాలన్నారు. తాను ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కింది స్థాయిలో సమస్యలపై దృష్టి సారించానన్నారు. అనంతపురం జిల్లా కోర్టు వందేళ్ల వేడుకల్లో పాల్గొనడం ఓ మధురానుభూతి అని సీజే పేర్కొన్నారు. ఒక వ్యవస్థ వందేళ్లు పూర్తి చేసుకుంది అంటే అందులో మనందరి చరిత్ర నిక్షిప్తమై ఉంటుందన్నారు. శతాబ్ది వేడుకలంటే సంబరాలు మాత్రమే కాదని, వందేళ్ల చరిత్రను అందించిన మహనీయులను స్మరించుకోవడమని చెప్పారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ అనంతపురం నుంచి ఎంతోమంది హైకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖ న్యాయవాదులు వచ్చారన్నారు. హైకోర్టు జడ్జి జస్టిస్‌ వెంకటరమణ మాట్లాడుతూ తమ కుటుంబానికి అనంతపురం జిల్లా కోర్టుతో విడదీయరాని అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో నిన్నటి తరంలోని మహనీయులు పాటించిన విలువలను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉమాదేవి, జస్టిస్‌ గంగారావు, జస్టిస్‌ సురేష్‌రెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కోదండరామ్‌, అనంతపురం జిల్లా జడ్జి అరుణసారిక తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సీజే సహా న్యాయమూర్తులందరూ లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు.

ఇదీ చదవండి

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్.. కారణం ఇదేనా..!

Last Updated : Mar 28, 2021, 5:20 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details