ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్‌ఈసీ అప్పీల్‌పై 18న విచారణ

ap high court on sec
ఎస్‌ఈసీ రిట్‌ అప్పీల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

By

Published : Jan 12, 2021, 5:09 PM IST

Updated : Jan 13, 2021, 4:41 AM IST

16:27 January 12

ఈ నెల 18కి వాయిదా వేసిన హైకోర్టు

సీనియర్ న్యాయవాది శ్రావణ్ కుమార్​తో ముఖాముఖి

 

పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణను హైకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌తో కూడిన సంక్రాంతి సెలవుల ప్రత్యేక ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ నెల 18కి విచారణను వాయిదా వేసినా స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా సిద్ధం చేసే ప్రక్రియకు ఆటంకం ఉండదని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఒకవేళ హైకోర్టు ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తే కేవలం ఓటర్ల జాబితా సిద్ధం కాలేదనే కారణంతో ఎన్నికల నిర్వహణకు మరింత సమయం కోరబోమని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే కొత్త పథకాలను ప్రారంభించే అవకాశం లేదని.. అలాంటివి ఏమైనా ఉంటే ఎన్నికల కమిషనర్‌ నుంచి అనుమతి తీసుకున్నాకే ప్రభుత్వం ముందుకెళుతుందని చెప్పారు.

     స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగేవి కాబట్టి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రభావం చూపదని తెలిపారు. ఆ వివరాల్ని నమోదు చేసిన ధర్మాసనం ఎస్‌ఈసీ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రభుత్వం కొత్త పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే.. 18న జరిగే విచారణలో కోర్టు దృష్టికి తీసుకురావచ్చని ఎస్‌ఈసీకి సూచించింది.


   ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిమిత్తం ఈ నెల 8న ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈ నెల 11న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని ఎన్నికల సంఘం హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. సంక్రాంతి సెలవుల తర్వాత 18న హైకోర్టు పునఃప్రారంభం కానున్నందున ఆ రోజుకు విచారణను ఎందుకు వాయిదా వేయకూడదని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ను ప్రశ్నించింది.


ఓటర్లలో గంగరగోళం తలెత్తుతుంది
    ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ‘సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు ఈ నెల 18 వరకు అమల్లో ఉంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ఓటర్లలో గందరగోళం తలెత్తుతుంది. ఇంకొక్కరోజు ఆలస్యమైనా మరింత గందరగోళానికి తావిచ్చినట్లవుతుంది. 9 నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్‌ అమలును నిలిపివేయడంతో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ నిలిచిపోయింది. రిట్‌ అప్పీల్‌పై అత్యవసర విచారణ జరపాలి. సింగిల్‌ జడ్జి నోటిఫికేషన్‌ను నిలపగానే.. సందేహాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే నాలుగు వేలకుపైగా వినతులు, ఈ మెయిల్స్‌ వచ్చాయి. ఈ నెల 23 నుంచి మొదటి విడత ఎన్నికల షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. విచారణను 18కి వాయిదా వేస్తే.. ఎన్నికల సన్నద్ధత మరింత కష్టంగా మారుతుంది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు చట్టసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఎన్నికలు నిలిపివేయడాన్ని అనుమతిస్తే.. ప్రజాస్వామ్య విలువలపై ప్రజలు నమ్మకం కోల్పోతారు’ అన్నారు.


   షెడ్యూల్‌ ప్రకారమే ఓటర్ల జాబితా: ఏజీ
ప్రభుత్వం తరఫున ఏజీ స్పందిస్తూ.. ‘గత మార్చిలో ఎస్‌ఈసీ ఎన్నికల్ని వాయిదా వేసింది. అప్పటికే ఓటర్ల జాబితా ప్రచురితమయ్యింది. భారత ఎన్నికల సంఘం 2021 జనవరి 1నాటికి ఉన్న సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 15న అందజేయాల్సి ఉంది. ఆ వివరాల్ని ప్రభుత్వం ఈ నెల 22న ఎస్‌ఈసీ ముందుంచాలి. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల కారణంగా ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ నిలిచిపోదు. షెడ్యూల్‌ ప్రకారమే ముందుకెళతాం. ఈ నెల 18కి వాయిదా వేయడం ఓటర్ల జాబితా సిద్ధం చేసే ప్రక్రియపై ప్రభావం చూపదు’ అన్నారు.  దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ నెల 18 వరకు వేచిచూస్తే ఎస్‌ఈసీకి న్యాయపరంగా కలిగే అవరోధం ఏమి లేదని అభిప్రాయపడింది. రెగ్యులర్‌ బెంచ్‌ విచారణ జరిపేందుకు 18కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి వాణీమోహన్‌ తొలగింపు

Last Updated : Jan 13, 2021, 4:41 AM IST

ABOUT THE AUTHOR

...view details