మరో ఆరుగురు ఐఏఎస్‌లకు హైకోర్టులో ఊరట
15:53 April 28
ఐఏఎస్‌లకు సామాజిక శిక్షను 8 వారాలు నిలిపివేసిన హైకోర్టు డివిజన్ బెంచ్
High Court Hearing on Social Punishment Imposed on IAS: సామాజిక సేవ శిక్ష వ్యవహారంలో మరో ఆరుగురు ఐఏఎస్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. కోర్టు ధిక్కరణ కేసులో సామాజిక శిక్ష విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును ధర్మాసనం 8 వారాలు నిలుపుదల చేసింది. విచారణను జూన్ 20కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖర్‌రావుతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ధర్మాసనం ముందు ఊరట లభించిన వారిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్య పూర్వ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు, పురపాలకశాఖ పూర్వ డైరెక్టర్ ఎం.ఎం. నాయక్, పురపాలకశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, పురపాలకశాఖ పూర్వ డైరెక్టర్ జి.విజయకుమార్ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలలో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్యకేంద్రాల నిర్మాణాలు జరగకుండా చూడాలని, ఏర్పాటుచేసిన వాటిని తొలగించాలని న్యాయస్థానం ఆదేశించినా పట్టించుకోకపోవడంతో హైకోర్టు సింగిల్ జడ్జి.. 8 మంది ఐఏఎస్‌లకు తొలుత రెండు వారాల జైలుశిక్ష, జరిమానా విధించారు. అనంతరం అధికారులు క్షమాపణలు కోరారు. దాన్ని అంగీకరించాలంటే నెలలో ఓ ఆదివారం చొప్పున 12 ఆదివారాలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను సందర్శించి, అక్కడి విద్యార్థులతో కొంత సమయం గడిపి, ఆ పూటకు అయ్యే భోజన ఖర్చులను భరించాలని న్యాయమూర్తి సూచించారు. అందుకు అధికారులు మౌఖికంగా అంగీకారం తెలిపారు. దీంతో జైలుశిక్షను రద్దు చేసిన న్యాయమూర్తి.. వసతి గృహాలకు వెళ్లి సామాజిక సేవ చేయాలన్నారు. ఆ తీర్పును సవాలు చేస్తూ ఆరుగురు ఐఏఎస్‌లు ధర్మాసనం ముందు అప్పీళ్లు వేశారు.
ఇదీచదవండి: 'శక్తిమంతమైన భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం వహించాలి'