ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 7, 2021, 7:28 AM IST

ETV Bharat / city

AP HC: ఓసారి అర్హులన్నాక.. పథకాల సాయం మధ్యలో ఆపొద్దు

ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను ప్రజలకు వర్తింపచేసేముందు అర్హతపై పూర్తి స్థాయి విచారణ చేయాలని.. ఓసారి అర్హులుగా పేర్కొన్నాక.. ఏ కారణంతో అయినా మధ్యలో నిలుపుదల చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. అర్హులమైన తమకు వైఎస్​ఆర్ చేయూత పథకం నిలిపివేశారని 20 మంది లబ్ధిదారులు దాఖలు చేసిన పిటిషన్​పై గతంలో విచారణ జరిపింది. కోర్టు ఆదేశాలను అమలుచేయనందుకు కోర్టుధిక్కరణ వ్యాజ్యంగా పరిగణించి ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది.

AP HC
AP HC

ప్రభుత్వ పథకాలను వర్తింపజేసే ముందు లబ్ధిదారుల అర్హతపై పూర్తిస్థాయి విచారణ చేయాలని, ఓసారి అర్హులుగా పేర్కొన్నాక ఏ కారణం చేతైనా మధ్యలో వాటిని నిలిపివేయొద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పథకాల సాయాన్ని పొందేందుకు 90 శాతం మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. ప్రభుత్వం సదుద్దేశంతో పథకాలు తీసుకొచ్చినా కొందరు అధికారుల తీరుతో అవి అర్హులకు చేరడం లేదని తెలిపింది. రాజకీయ కారణాలతో పథక ప్రయోజనాలను నిలిపేయడం సరికాదంది.

ప్రజలు కూడా అధికారంలో ఉన్నవారిని గౌరవించాలని, అప్పుడే అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి వీలుంటుందని తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకైనా సర్వీసు నిబంధనలున్నాయి కానీ.. రాష్ట్రంలోని వాలంటీర్లకు లేవని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. వాలంటీర్లకు నచ్చితే పథకాలు వర్తిస్తాయి.. నచ్చకపోతే సంక్షేమ కార్యదర్శితో చెప్పి పేరు తొలగిస్తున్నారని ఆక్షేపించింది. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌కు సూచించింది.

తమకు అర్హత ఉన్నా ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం వర్తింపజేయడం లేదంటూ కృష్ణా జిల్లా చందర్లపాడుకు చెందిన 20 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు హైకోర్టును ఆశ్రయించారు. వారికి ప్రయోజనాలు కల్పించాలని అధికారులను ఆదేశించినా చెల్లించకపోవడంతో కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు. పింఛను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటన్నింటిపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్లకు వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ప్రయోజనం అందలేదన్న అంశంపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ వేస్తామని డీఆర్‌డీఏ పీడీ తరఫు న్యాయవాది రవితేజ తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ విచారణను ఈ నెల 13కు వాయిదా వేశారు.

ఇదీ చదవండి: RAINS : రాష్ట్రంలో పొంగిపొర్లిన వాగులు, వంకలు... నేడు, రేపు భారీవర్షాలు

ABOUT THE AUTHOR

...view details