పురపాలక, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికల కోసం 2020 మార్చి 9న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ దశలో కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని మార్చి 15న ఎన్నికలను వాయిదా వేసింది. ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉన్నందున నిలిచిపోయిన దగ్గర్నుంచి ఎన్నికల కొనసాగింపునకు ఈ నెల 15న నోటిఫికేషన్లు ఇచ్చింది. వాటిని సవాలు చేస్తూ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన యశోద, మధుసూదన్, త్రివేణిరెడ్డి తదితరులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఎస్‌ఈసీ నిర్ణయంతో ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కోల్పోవాల్సి వస్తోందంటూ తాడిపత్రికి చెందిన సి.విష్ణువర్ధన్‌రెడ్డి, మరికొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్, రాష్ట్ర ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలతో ఏకీభవిస్తూ శుక్రవారం నిర్ణయాన్ని వెల్లడించారు.
ఎస్‌ఈసీకి సర్వాధికారాలు
'ఎన్నికల ప్రకటన జారీ నుంచి ఫలితాల వెల్లడి వరకు ఎస్‌ఈసీయే ఏకైక అధికార కేంద్ర బిందువు. ఎన్నికల పర్యవేక్షణ, నియంత్రణలో ఎస్‌ఈసీ అధికారాలపై సందేహమే అక్కర్లేదు. చట్టాలు, నిబంధనల్లో పేర్కొనని అంశాల విషయంలో పరిస్థితుల ఆధారంగా ఎస్‌ఈసీ వ్యవహరించవచ్చని సుప్రీంకోర్టు చాలా కేసుల్లో స్పష్టం చేసింది. మానవాళిని భయపెట్టిన కరోనా సమయంలో.. ఎన్నికలను వాయిదా వేయడానికి ఎస్‌ఈసీ అధికారాల్ని వినియోగించింది. ఏపీ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ నిబంధన 7 ప్రకారం.. ఎన్నికలను వాయిదా వేసేందుకు ఎస్‌ఈసీకి అధికారం ఉంది. సహేతుకమైన కారణం, కోర్టు ఉత్తర్వులున్నా ఎన్నికల్లో సవరణ, మార్పు చేయవచ్చు. నామినేషన్లు వేసే ప్రక్రియ దగ్గర నుంచి రీ-నోటిఫికేషన్ ఇవ్వచ్చు. అయితే నామినేషన్లు వేసే దగ్గర్నుంచి ప్రక్రియను ప్రారంభిస్తే అంతకు ముందు వేసిన నామినేషన్లకు డిపాజిట్‌ను తిరిగి చెల్లించాలి. రీనోటిఫికేషన్ ఇవ్వకపోతే డిపాజిట్ తిరిగి ఇవ్వక్కర్లేదు. ఎన్నికలను వాయిదా వేస్తూ గతేడాది ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ నేపథ్యంలో.. గత ఉత్తర్వులకు కొనసాగింపుగా ఎస్‌ఈసీ ప్రస్తుత ఎన్నికల నోటిఫికేషన్లు ఇచ్చింది. ఎన్నికలు వాయిదా పడిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు (11 నెలల మధ్యలో) ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత పొందారని పిటిషనర్లు చెబుతున్నప్పటీకి.. ఆ వివరాలేవీ వ్యాజ్యంలో లేవు. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ నిర్ణయంతో పిటిషనర్లు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు నిరాకరణకు గురైందని చెప్పలేం. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని ఎన్నికలపై ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నాం. వాయిదా పడిన ఎన్నికలను పునఃప్రారంభించాలన్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికలను ఎస్‌ఈసీ పునఃప్రారంభించింది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న అనుబంధ పిటిషన్లను కొట్టేస్తున్నాం' అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
పుర ఎన్నికల ప్రక్రియ పున:ప్రారంభం.. ఎక్కడ ఆగాయో అక్కడి నుంచే..