వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్‌ను ఇక నుంచి ప్రత్యేక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా సరఫరా చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. అందులో భాగంగా ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్‌ను ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ(AP RASCOM)గా మార్చాలని ఇంధన శాఖ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకుగానూ ఏపీ రాస్కమ్ విద్యుత్ పంపిణీ సంస్థ(ap Rascom)గా పనిచేయనుంది.
అయితే 10వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి కోసం గతంలోనే ఏపీ గ్రీన్ఎనర్జీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. నిధులలేమి కారణంగా ఆ విద్యుత్‌ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. కేబినెట్ నిర్ణయం ప్రకారం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరఫరా చేయనుంది. ఈ విద్యుత్‌ను ఏపీ రాస్కమ్ ద్వారా వ్యవసాయానికి పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతానికి పంపిణీ నెట్‌వర్క్ లేనందువల్ల రాష్ట్రంలోని 3 డిస్కమ్‌లకు చెందిన విద్యుత్ పంపిణీ వ్యవస్థనే రాస్కమ్ వినియోగించుకునేలా నిర్ణయించారు.