రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఆదేశాలు జారీచేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ సిద్దార్థ్ జైన్ బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ సర్వే ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం సర్వే సెటిల్ మెంట్ కమిషనర్ పోస్టులో సిద్దార్థ్ జైన్‌ను నియమించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా ఐఏఎస్ అధికారి ఎం.వి. శేషగిరిబాబును నియమించారు.
ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్, ఎండీగా కె.రవీన్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఏపీ టవర్స్ సీఈవోగా ఎం.రమణారెడ్డి, ఏపీ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా సీహెచ్ రాజేశ్వరరెడ్డిని నియమించారు. ఇప్పటివరకు డిప్యుటేషన్‌పై ఆ పదవిలో ఉన్న సురబాలకృష్ణను మాతృశాఖకు పంపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్లో ఉన్న ఐఆర్ఎస్ అధికారి ఎస్.బి.ఆర్ కుమార్ లిఖిమ్ శెట్టికి పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం.. ఆయన్ను ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ డైరెక్టర్‌గా నియమించింది.