ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP Govt Talks with Employees Union: కాలయాపన వద్దు.. సీఎం దగ్గరకు ఎప్పుడు?

AP Govt Talks with Employees Union
AP Govt Talks with Employees Union

By

Published : Dec 22, 2021, 9:01 PM IST

Updated : Dec 23, 2021, 5:04 AM IST

20:55 December 22

సీఎం వద్దకు ఎందుకు తీసుకెళ్లడం లేదని ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద అసంతృప్తి

AP Govt Talks with Employees Union: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో బుధవారం జరిగిన చర్చల్లో ఫిట్‌మెంట్‌పై ఎలాంటి స్పష్టత రాలేదు. పదేపదే సమావేశాల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పితే.. ముఖ్యమంత్రి వద్దకు ఎందుకు తీసుకెళ్లడం లేదని ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు.

వచ్చే వారంలో సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పీఆర్సీ, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌, కార్యదర్శి శశిభూషణ్‌ బుధవారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఫిట్‌మెంట్‌ ఎంత ఉంటుందనే దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి మరోసారి అభిప్రాయాలను తీసుకున్నారు. వాటిని ఈ వారంలో మరోసారి సీఎం జగన్‌కు వివరిస్తామని సీఎస్‌ చెప్పారు. ఉద్యోగ సంఘాలు ఇచ్చిన డిమాండ్లపైనా చర్చించారు. పీఎఫ్‌, జీఎల్‌ఎస్‌ఐ, వైద్య బిల్లులు, పదవీ విరమణ ప్రయోజనాలు, రుణాలకు సంబంధించిన చెల్లింపులను క్రిస్మస్‌ నుంచి ప్రాధాన్యత క్రమంలో మార్చిలోపు పరిష్కరిస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు మాత్రం జనవరిలోపే చెల్లింపులు పూర్తి చేయాలని కోరాయి. ఉద్యోగ సంఘాల సమావేశం కంటే ముందుకు అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో సీఎస్‌ సమావేశమయ్యారు. గత జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో ఉద్యోగ సంఘాలు వెల్లడించిన డిమాండ్లు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై చర్చించారు. మొత్తం 28 శాఖల్లో 816 సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో అత్యధికంగా ఆర్థిక శాఖలో 334, పాఠశాల విద్యలో 168, ఉన్నత విద్యలో 71, రెవెెన్యూలో 30, వైద్యారోగ్యశాఖలో 28 అంశాలున్నాయి.

వీలైన అన్నింటినీ పరిష్కరిస్తాం: సీఎస్‌

ఉద్యోగుల డిమాండ్లలో వీలైనన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అన్నారు. ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘గత జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పీఆర్సీ ఫిట్‌మెంట్‌ మినహా మిగతా 70 డిమాండ్ల పరిష్కారానికి పరిశీలిస్తున్నాం. కార్యదర్శుల సమావేశంలో చర్చించాం. పీఆర్సీ ఫిట్‌మెంట్‌, పెండింగ్‌ బిల్లుల చెల్లింపు అంశానికి సంబంధించి ఉద్యోగ సంఘాల స్పందన తీసుకున్నాం. వీటిని మరోసారి పరిశీలించి ఉద్యోగ సంఘాలతో మాట్లాడతాం’ అని పేర్కొన్నారు.

ప్రథమ ప్రాధాన్యంగా జీపీఎఫ్‌ బకాయిలు, తర్వాత ఏపీజీఎల్‌ఐ, మెడికల్‌ బిల్లులు, పదవీ విరమణ చేసిన వారి బిల్లుల చెల్లింపుల్ని పరిశీలిస్తామని ఆర్థికశాఖ అధికారులు హామీ ఇచ్చారు. మార్చిలోపు బిల్లులన్నీ క్లియర్‌ చేస్తామన్నారు. అశుతోష్‌ మిశ్రా సిఫార్సుల్ని యథాతథంగా అమలు చేయాలి. -బండి శ్రీనివాసరావు, ఏపీజేఏసీ

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో ఆందోళన ఎక్కువైంది. వచ్చే వారంలో సీఎం వద్దకు తీసుకెళ్లి.. పీఆర్‌సీ అంశాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారు. 45% ఫిట్‌మెంట్‌ ప్రకటిస్తే రూ.8,200 కోట్లు మాత్రమే ఏడాదికి ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలియజేశాం. ప్రభుత్వ ఉద్యోగులతోపాటే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకూ పీఆర్‌సీ ప్రయోజనాలను వర్తింపజేసేలా ఒకేసారి ప్రకటన చేయాలని కోరుతున్నాం.-బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి

ఎంతసేపూ మా అభిప్రాయాలు అడుగుతున్నారు తప్ప.. సీఎంకు ఏం చెబుతున్నారు? ఆయన ఏం చెప్పారనే సంగతి అధికారులు మాకు చెప్పడం లేదు. ఖర్చు ఎక్కువ చేసి చూపిస్తున్నారు. సీఎం ఎక్కడ ఎక్కువ ఇస్తారో అని.. అన్నీ ఎక్కువ చేసి చూపిస్తూ ఉద్యోగులకు నష్టం కలిగేలా చేస్తున్నారు. 34% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయాలని కోరాం. -వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం

ఉద్యోగులు, వారి కుటుంబ జీవన స్థితిగతులపై ప్రభావం చూపే పీఆర్‌సీ వ్యవహారం.. కూరగాయల బేరం, మార్కెట్‌ సంత తీరుగా ఉండటం దురదృష్టకరం. ఉన్నతస్థాయి సమావేశంలో అంశాల వారీగా పరిష్కారానికి కృషి చేయకుండా... ఊకదంపుడు ఉపన్యాసాలకే ఉద్యోగ సంఘాలు పరిమితమవుతున్నాయి. ఈ కథ ఎప్పటికి సుఖాంతమవుతుందో అర్థం కావట్లేదు. వారం రోజుల్లో సీఎంతో మాట్లాడి.. ఏ సంగతి చెబుతానని సీఎస్‌ చెప్పారు. -సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఇదీ చదవండి:
అజయ్​ జైన్​తో ఉద్యోగ సంఘాల భేటీ.. ఈ సమస్యలపైనే చర్చ

Last Updated : Dec 23, 2021, 5:04 AM IST

ABOUT THE AUTHOR

...view details