హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం
హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లింది. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను ప్రతివాదిగా చేరుస్తూ.. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
మాజీ అడ్వొకేట్ జనరల్ తదితరులపై ఏసీబీ నమోదు చేసిన కేసు దర్యాప్తు కొనసాగించొద్దని, విచారణకు సంబంధించిన అంశాలను ప్రచురణ చేయకూడదని ఇటీవల ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను ప్రతివాదిగా చేరుస్తూ సోమవారం ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ‘దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే స్టే ఇవ్వొచ్చా? దర్యాప్తు ప్రక్రియలో హైకోర్టు జోక్యం చేసుకోవచ్చా? ఎఫ్‌ఐఆర్‌లో ప్రాథమిక ఆరోపణలు ఉన్నప్పుడు సదరు వ్యక్తిపై దర్యాప్తు ప్రక్రియ నిలిపేయొచ్చా?’ అంటూ స్పెషల్ లీవ్ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.