APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటు వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఉద్యోగుల జీతాలు ప్రభుత్వమే చెల్లిస్తున్న తరుణంలో సొంత బస్సుల సంఖ్యను మరింత పెంచి ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సి ఉన్నా.. అద్దె బస్సుల సంఖ్యను పెంచేస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ ఉద్యోగులుగా మారడంతో ఖాళీలను ప్రభుత్వమే భర్తీ చేయాలి. అద్దె బస్సులు తీసుకుంటే నియామకాలు అవసరం ఉండవు. ఒకేసారి 998 అద్దె బస్సులను టెండర్లు పిలవడం సంస్థలో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఆర్టీసీలో 11,236 బస్సులు ఉన్నాయి. వీటిలో సొంత బస్సులు 8 వేల 972 కాగా.. అద్దెవి 2 వేల 264. మొత్తం బస్సుల్లో 3 వేలు కాలం చెల్లిపోయాయి. వీటి స్థానంలో కొత్తవి తీసుకోవాలి. అయితే యాజమాన్యం అద్దె బస్సుల బాట పడుతోంది. ఎన్ని బస్సులు అవసరమనే వివరాలను ఉన్నతాధికారులు జిల్లాల నుంచి ఇటీవల తెప్పించుకున్నారు. దాదాపు 16 వందల 33 బస్సులు అవసరమని నివేదిక వచ్చింది. వీటిలో 998 బస్సులను అద్దెకు తీసుకోవడానికి ఇటీవలే టెండర్లు పిలిచారు. ఈ నెల 5 వరకు టెండర్ల దాఖలుకు గడువుంది. 10, 11 తేదీల్లో రివర్స్ వేలం నిర్వహించి.. వాటికి కిలోమీటరుకు చెల్లించే ధరలను ఖరారు చేస్తారు. ఈ అద్దె బస్సులకు తోడు.. ఇప్పటికే టెండర్లు ఖరారు చేసి ఆర్డర్ ఇచ్చిన 100 విద్యుత్ ఏసీ అద్దె బస్సులూ త్వరలో రానున్నాయి. అద్దె బస్సుల్లో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు కలిపి 617 బస్సులు ఉన్నాయి.
ఆర్టీసీలో 25 శాతం మాత్రమే అద్దె బస్సులు తీసుకోవాలని.. మిగిలినవి సొంతవే ఉండాలనే నిబంధన ఉండేది. కొంతకాలం క్రితం పాలకవర్గ సమావేశంలో.... అద్దె బస్సుల వాటాను 35 శాతానికి పెంచుతూ తీర్మానించి దాన్ని బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. ఇప్పుడు 998 అద్దె బస్సులు ఎలా తీసుకుంటున్నారని ఆరా తీయగా.. తీర్మానం విషయం బయటకువచ్చింది. 2020 మార్చిలో 250 బస్సులు కొన్నారు. తర్వాత కొత్త బస్సులపై దృష్టి పెట్టలేదు. BS-6 వాహనాలు అందుబాటులోకి వచ్చాక ఆర్టీసీ సొంత బస్సులు తీసుకోలేదు.