చదువు కావాలంటే రైల్వేగేట్లు, కాల్వలు, జాతీయ రహదారులు దాడి రావాల్సిందేనని విద్యాశాఖ స్పష్టం చేసింది. పాఠశాలల విలీనానికి ఇవేమీ అడ్డురావని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అధికారిక రైల్వేగేట్లు, వంతెనలు ఉన్న కాల్వలు, జాతీయ రహదారులను పిల్లలు వెళ్లేందుకు అవరోధాలుగా పరిగణించొద్దని ఆదేశించింది. ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంపై ప్రధానోపాధ్యాయుల సందేహాలకు సమాధానాలిచ్చింది. జాతీయ రహదారులపై జీబ్రా క్రాసింగ్‌లు ఉంటాయని, పాఠశాలల ఆయాలు రోడ్డు దాటిస్తారని.. ఇది విలీనానికి అడ్డంకి కాదని స్పష్టం చేసింది.
ప్రాథమిక పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఒకే ఉన్నత పాఠశాల ఉంటే వెయ్యి మంది విద్యార్థులున్నా 3,4,5 తరగతులను విలీనం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల లేకపోతేనే ప్రాథమికోన్నత బడిలో విలీనం చేయాలని సూచించింది. ఒకవేళ ఒక ప్రాథమిక పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలో రెండు, మూడు ఉన్నత పాఠశాలలు ఉంటే మౌలికసదుపాయాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, దూరాన్ని ప్రామాణికంగా తీసుకొని మ్యాపింగ్ చేయాలని తెలిపింది. సమీపంలో బాలికల ఉన్నత పాఠశాల ఉంటే ఎనిమిదో తరగతి వరకు బాలురును అందులో విలీనం చేయనున్నారు. 3 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉంటే 8వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి ఏడాదికి వెయ్యిరూపాయల చొప్పున సమగ్ర శిక్ష అభియాన్ నుంచి రవాణా ఛార్జీలు చెల్లించనున్నారు.