వాయుగుండం కారణంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు నాలుగు జిల్లాల్లో 24 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వేర్వేరు చోట్ల మరో 17 మంది గల్లంతైనట్టు తెలిపింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది.
ap govt on rains: వర్షాలు, వరదలతో.. 24 మంది మృతి: ప్రభుత్వం
20:02 November 20
చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో తీవ్ర ఆస్తి నష్టం: ప్రభుత్వం
భారీ వర్షాలతో చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో 172 మండలాలు ప్రభావితం అయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. చిత్తూరులో అత్యధికంగా 66 , అనంతపురంలో 46, కడపలో 48 మండలాల్లో వర్షాల కారణంగా తీవ్ర ఆస్తినష్టం జరిగిందని వెల్లడించింది. ఈ నాలుగు జిల్లాల్లోనూ 23,994 మంది ప్రభావితం అయ్యారని పేర్కొంది. నాలుగు జిల్లాల్లోనూ వర్షాల కారణంగా 2,33,450 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వెల్లడించింది.19,644 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు పేర్కొంది. సహాయ కార్యక్రమాల కోసం నాలుగు జిల్లాలకూ తక్షణ సాయంగా రూ.7 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలియచేసింది. రిలీఫ్ క్యాంపుల్లోని వారికి కుటుంబానికి రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలియచేసింది. రహాదారులు, విద్యుత్ పునరుద్ధరణ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్టు తెలిపింది.
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం..
భారీ వర్షాల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.4కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్టు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో గత 30 ఏళ్లలో ఎప్పుడూలేనంత వర్షం పడిందన్నారు. తిరుమలలో జరిగిన నష్టం వివరాలను ఆయన వివరించారు. ‘‘ఘాట్ రోడ్‌లోని 13చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఘాట్ రోడ్డులో ఐదు చోట్ల రక్షణ గోడలు దెబ్బతిన్నాయి. ఘాట్‌రోడ్లు, మెట్ల మార్గంలో వెంటనే మరమ్మతు పనులు చేపడతాం. నారాయణగిరి అతిథి గృహం, కపిలతీర్థం మండపం దెబ్బతిన్నాయి. తిరుమల వచ్చే భక్తులకు వసతి, భోజన సదుపాయం కల్పిస్తాం’’ అని సుబ్బారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:Rayalacheruvu lake: ఆ చెరువు ఎప్పుడైనా తెగొచ్చు జాగ్రత్తా.. అధికారుల దండోరా