బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్స్ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ కార్యదర్శి విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. నివేదికకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 13 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని ఆరు భాగాలుగా విభజించి కమిటీ అధ్యయనం చేసిందని అన్నారు. ఏ ప్రాంతంలో ఏయే వనరులు ఉన్నాయో కమిటీ అధ్యయనం చేసిందని వెల్లడించారు. విశాఖలో తప్ప మిగతా చోట్ల అంతర్జాతీయ విమాన ప్రయాణికులు అంతగా లేరని..పోర్టులు కూడా విశాఖలో మినహా మిగతా చోట్ల అభివృద్ధి చెందలేదని తెలిపారు. రాష్ట్రానికి రూ. 2.5 లక్షల కోట్ల రుణభారం ఉందని...ఎనిమిది జిల్లాల్లో పారిశ్రామిక ఉత్పత్తి చాలా తక్కువగా ఉందన్నారు. విదేశీ పర్యటకుల వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రను మెడికల్ హబ్‌గా చేయవచ్చని...కాఫీ, పసుపు, జీడిపప్పు పరిశ్రమలకు ఉత్తరాంధ్ర ఎంతో అనుకూలంగా ఉందని వివరించారు. కృష్ణా డెల్టాను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చవచ్చని చెప్పారు.
- ఉత్తరాంధ్రను మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేయవచ్చు
- కాఫీ, పసుపు, జీడిపప్పు పరిశ్రమలకు ఉత్తరాంధ్ర అనుకూలం
- కొన్ని రకాల పర్యాటకాలకూ ఉత్తరాంధ్ర చాలా అనుకూలంగా కూడా ఉంది
- గోదావరి డెల్టాలో ప్లాస్టిక్, గ్యాస్ రంగాల్లో పరిశ్రమలు పెట్టవచ్చు.
- గోదావరి డెల్టాలో బ్యాక్‌వాటర్ టూరిజం లాంటివి అభివృద్ధి చేయవచ్చు.
- పోలవరం, వాటర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్ లాంటివి గోదావరి డెల్టాలో ఏర్పాటు చేయవచ్చు
- కృష్ణా డెల్టాలో ఎడ్యుకేషన్ హబ్ అభివృద్ధి చేయవచ్చు.
- మైపాడు సముద్రతీరాన్ని బాగా అభివృద్ధి చేయవచ్చు.
- గోదావరి-పెన్నా అనుసంధానం చేసేందుకు కమిటీ ప్రతిపాదనలు చేసింది.
- కర్నూలు-అనంతపురం ప్రాంతంలో ఆటోమొబైల్ లాజిస్టిక్ హబ్‌కు అవకాశం
- తిరుపతిలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ప్రోత్సహించాలని కమిటీ సూచించింది
- చిత్తూరు జిల్లాలో టమాటాల నిల్వకు శీతల గిడ్డంగులు అభివృద్ధి చేయాలి.