కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన బులెటిన్‌ను వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇవాళ మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినట్టు ప్రకటించింది. లండన్ నుంచి చెన్నై, శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి వచ్చిన 25 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కి చేరిందని వెల్లడించింది. నెల్లూరులో కరోనా సోకిన వ్యక్తి కోలుకోగా... పాజిటివ్ కేసుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 7గా నమోదు అయినట్టు స్పష్టం చేసింది.
ఇవాళ ఒక్కరోజే 453 మంది విదేశాల నుంచి వచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 14,907 మందిని పర్యవేక్షణలో ఉంచినట్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో మరో మూడు చోట్లా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలియజేసింది. కడప, విశాఖపట్నం, గుంటూరులో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. 12,131 పడకలతో జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. క్వారంటైన్ కేంద్రాల వద్ద సీనియర్ అధికారులను నియమించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.