రాష్ట్రంలో తొలి త్రైమాసికంలోనే ప్రభుత్వం ఏకంగా 33 వేల 294 కోట్ల రూపాయలను అప్పుల రూపంలో సమీకరించింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కల ప్రకారం ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం రుణలక్ష్యంలో 68 శాతం మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది. ఏడాది మొత్తం చేయాలనుకున్న అప్పులో మూడింట రెండొంతుల అప్పును తొలి మూడు నెలల్లోనే తీసుకురావాల్సి వచ్చింది. పైగా ఈ 3 నెలల్లో ప్రభుత్వం చేసిన ఖర్చుల్లో ఏకంగా 60 శాతం అప్పు రూపంలో తెచ్చిన సొమ్మునే ఖర్చు చేసింది. మరోవైపు రూ.27 వేల 67కోట్లు రెవెన్యూ లోటుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వసూళ్లు 21 వేల 74 కోట్లు కాగా... రెవెన్యూ ఖర్చు రూ.48 వేల 142 కోట్లగా ఉంది. మొత్తం ఖర్చు రూ.54 వేల 335 కోట్లుగా ఉంటే. అందులో పెట్టుబడి వ్యయం రూ.6 వేల 193కోట్లుగా ఉంది.
ప్రభుత్వానికి సొంత పన్నుల రూపంలో... మూణ్నెళ్లలో రూ.12 వేల 531 కోట్లు ఆదాయం వచ్చింది. దీన్ని జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లో వాటాలు సహా... ఇతర పన్నుల ఆదాయం కలిపితే వచ్చిన ఆదాయంగా లెక్కగట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.లక్షా 2 వేల 917 కోట్ల రెవెన్యూ వసూళ్లు ఉంటాయని అంచనా వేయగా... తొలి 3 నెలల్లో అందులో 12 శాతం మాత్రమే రాబట్టగలిగారు.