రాష్ట్రవ్యాప్తంగా బార్లను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని 840 బార్లు శనివారం నుంచి తెరుచుకోనున్నాయి. 2021 జూన్ 30 తేదీ వరకూ ప్రస్తుతం ఉన్న బార్ లైసెన్సులను పునరుద్ధరిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనికి ప్రతీ ఏటా 10 శాతం మేర లైసెన్సు ఫీజు కింద చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది. అలాగే బార్లలో విక్రయించే భారత్‌లో తయారైన విదేశీ మద్యంతో పాటు విదేశీ మద్యం, బీర్లు, వైన్స్ అలాగే రెడీ టూ డ్రింక్ మద్యం వెరైటీలపై 10 శాతం మేర అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్‌ను విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. బార్లలో జరిగే విక్రయాలపై అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ (ఏఆర్ఈటీ) విధిస్తున్నట్టు పేర్కొంది.
20 శాతం కొవిడ్ రుసుం
2020 సెప్టెంబరు 19 తేదీ నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో పాటు కొవిడ్ ఫీజు కింద బార్ లైసెన్సులపై 20 శాతం మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది. బార్ లైసెన్సు ఫీజులోని తిరిగి చెల్లించని రిజిస్ట్రేషన్ ఛార్జ్ స్లాబ్ ఆధారంగా ఈ 20 శాతం కొవిడ్ ఫీజును విధిస్తున్నట్టు అబ్కారీశాఖ పేర్కొంది. పేదలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలుకు గానూ అదనపు ఆదాయం కోసం పన్నులు, ఫీజులను పెంచుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే ప్రతీ బార్ లైసెన్సు నుంచి 20 శాతం మేర తిరిగి చెల్లించని రిజిస్ట్రేషన్ ఛార్జి కింద కొవిడ్ ఫీజును విధిస్తున్నట్టు పేర్కొంది. ప్రజాప్రయోజనాల రీత్యా ఎక్సైజ్ చట్టం కింద ఈ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు 19 సెప్టెంబర్ నుంచే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొది.