గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు రాసిన అభ్యర్థులను రుణాత్మక మార్కులు తీవ్రంగా దెబ్బతీశాయి. 1 లక్ష 26 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం పంచాయతీ రాజ్ శాఖ పరీక్షలు నిర్వహించి... రుణాత్మక మార్కులను అమలు పరిచింది. పరీక్షల్లో రుణాత్మక మార్కుల విషయం తెలియక చాలా మంది నష్టపోయారని నిపుణుల కమిటీ తేల్చింది. ప్రతి 4 తప్పు జవాబులకు ఒక మార్కు కోల్పోయేలా నిబంధన విధించడం వల్ల కేటగిరీ -1 ఉద్యోగాలు రాసిన వారిలో అత్యధికులు నష్టపోయారని తేలింది. మార్కులు తక్కువ వచ్చాయంటూ పదివేల మంది ఫిర్యాదులు చేయగా...వీరందరి ఓఎంఆర్ షీట్లను పరిశీలించారు. రుణాత్మక విధానంతోనే ఈ విధంగా జరిగినట్లు నిపుణుల కమిటీ గుర్తించింది.
15 మార్కుల చొప్పున
కేటగిరీ-1 సహా పలు కీలక పోస్టులకు నిర్వహించిన పరీక్ష పేపర్లను కఠినంగా ఇచ్చారని.. చాలా మంది అర్హత మార్కులు సాధించలేక పోయేందుకు ఇదో ప్రధాన కారమని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో నిపుణుల కమిటీ పేర్కొంది. రుణాత్మక మార్కుల కారణంగా ఒక్కో అభ్యర్థి 17.5 నుంచి 25 మార్కులు కోల్పోయినట్లు తేల్చింది. అభ్యర్థులకు న్యాయం జరగాలంటే గ్రేస్ మార్కులు కేటాయించాలని అభిప్రాయపడింది. ప్రభుత్వ అనుమతితో ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులకు ఒక్కొక్కరికి 15 చొప్పున అదనపు మార్కులు కలపాలని నిర్ణయించారు.