AP government asked Rs 23,000 crore Loan: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలల్లో 23 వేల కోట్ల రుణం అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం.. రిజర్వు బ్యాంకుకు తెలియజేసింది. రిజర్వ్ బ్యాంక్ వర్గాలు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించి జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు ఎంత మొత్తం రుణం అవసరమవుతుందో సమాచారం సేకరించాయి. ఆ సమాచారం మేరకు రుణ డిమాండ్ క్యాలెండర్‌ను రూపొందించాయి. దాని ప్రకారం జనవరిలో రూ. 5 వేల కోట్లు, ఫిబ్రవరిలో రూ. 11 వేల కోట్లు, మార్చిలో రూ. 7 వేల కోట్ల చొప్పున మొత్తం రూ. 23 వేల కోట్ల అవసరమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నట్లు సమాచారం. ఐతే ఆ తర్వాత ఇవి మారుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలు తుది వివరాలు ఇస్తుంటాయి.
కేంద్రం నిర్ణయించాల్సిందే..
రిజర్వ్ బ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని రాష్ట్రాలు రుణాలు తీసుకుంటాయి. వీటిని పొందేందుకు కేంద్రం నుంచి అనుమతి ఉండాలి. అప్పుడే బహిరంగ మార్కెట్‌లో రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తొలి 9 నెలల కాలంలో అంటే.. ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఉన్న రుణ పరిమితి మేరకు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అప్పులు తీసుకుంది. చివరి మూడు నెలలకు రాష్ట్రం ఎంత మేర అప్పు తీసుకోవచ్చనేది.. కేంద్రం నిర్ణయించాల్సి ఉంది. ఇంకా దీనికి సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది.