ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్థానిక ఎన్నికల ప్రకటనపై హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

ap high court
హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం

By

Published : Jan 9, 2021, 3:36 PM IST

Updated : Jan 10, 2021, 2:53 AM IST

15:33 January 09

హౌస్‌ మోషన్ పిటిషన్ వేసిన ప్రభుత్వం

   పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తూ ఎస్​ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌, ఎన్నికల ప్రవర్తన నియమావళి విధింపు, బదిలీలపై నిషేధమివ్వడాన్ని సవాల్ చేస్తూ.... రాష్ట్ర ప్రభుత్వం... శనివారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఎన్నికల విషయంలో ముందుకెళ్లకుండా ఈసీ ని నిలువరించేలా ఆదేశించాలని.... ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని కోరింది. 

   ఈ నెల 8న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఎన్నికల కోడ్ విధింపుపై... రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.... శనివారం వ్యాజ్యం దాఖలు చేశారు. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు నవంబర్‌ 17న ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని.... దానిపై తాము హైకోర్టును ఆశ్రయించామని గుర్తుచేశారు. కోర్టు ఉత్తర్వులు అందిన మూడు రోజుల్లోగా... రాతపూర్వకంగా ఎస్​ఈసీ కి వివరాలు సమర్పించి సంప్రదింపులు జరపాలని ప్రభుత్వాన్ని..... డిసెంబర్ 29న ధర్మాసనం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. ధర్మాసనం ఉత్తర్వులు జనవరి 5న తమకు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదో జనవరి 7న రాతపూర్వకంగా ఎస్​ఈసీ కి తెలియచేశామన్నారు.  కోర్టు ఉత్తర్వుల ప్రతి అందుకోకముందే.... సంప్రదింపుల కోసం...సీఎస్, పీఆర్ శాఖ ముఖ్యకార్యదర్శికి ఎస్ఈసీ లేఖలు పంపారని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఆ లేఖలు, సంప్రదింపులు లాంఛనప్రాయంగా ఉన్నాయని.... ప్రజారోగ్యం, ప్రభుత్వాభిప్రాయాలతో సంబంధం లేకుండా.... ఎన్నికల నిర్వహణకు కమిషనర్‌ ఆలోచన చేశారని వ్యాజ్యంలో ప్రస్తావించారు. 

 ఈ నెల 8న సాయంత్రం నాలుగున్నర గంటలకు.... ప్రభుత్వాధికారులతో ఎస్ఈసీ సంప్రదింపుల ప్రక్రియ నిర్వహించి.... తర్వాత కొద్ది గంటల్లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని.... ప్రభుత్వం తన వ్యాజ్యంలో పేర్కొంది. దీన్ని గమనిస్తే సంప్రదింపుల చర్య కంటితుడుపులా ఉందని ప్రస్తావించింది. కోర్టు ఉత్తర్వులను, సంప్రదింపుల ప్రక్రియను కమిషనర్ అవహేళన చేశారని.. తాము రాతపూర్వకంగా సమర్పించిన వివరాల్ని ఎస్ఈసీ పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. కరోనా టీకా విషయమై కేంద్రం... అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్, అలాగే డ్రై రన్‌ నిర్వహించిందని వ్యాజ్యంలో ప్రస్తుతించింది. టీకా పంపిణీ ప్రక్రియ.... సాధారణ ఎన్నికల విధానంలా ఉండాలని.... కేంద్రం పలుమార్లు ఉద్ఘాటించిందని.... అంటే రాష్ట్ర యంత్రాంగమంతా అందులో పాల్గొనాల్సిన అవసరముందని పేర్కొంది.  సోమవారం... ముఖ్యమంత్రులతో ప్రధాని ఆన్‌లైన్ భేటీ ఉందని..... ఈ విషయాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లి సీఎం ప్రకటన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు ప్రభుత్వం తన వ్యాజ్యంలో వివరించింది. 

  తన పదవీ విరమణ తర్వాతకు ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని కమిషనర్ పేర్కొనడం... మొత్తం వ్యవహారాన్ని బలహీనపరుస్తోందని.... ప్రభుత్వం తన వ్యాజ్యంలో పేర్కొంది. అధికారపార్టీకి చెందిన నేతలు.... ఏప్రిల్‌, మేలో ఎన్నికలు ఉంటాయని చెప్పిన విషయాన్ని ఎస్ఈసీ ప్రస్తావించారని.... వారి అభిప్రాయాలతో తమకు సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఉన్న కమిషనర్... పార్టీకి, ప్రభుత్వానికి ఉన్న తేడా అర్థం చేసుకుని ఉండాల్సిందని పేర్కొంది. కేరళ, బీహార్, అమెరికాలో ఎన్నికల విషయాన్ని ఎస్ఈసీ తన ఉత్తర్వుల్లో ఉదహరించారని..... అక్కడ ఎన్నికల ప్రక్రియ తర్వాత... కరోనా కేసులు.... రెండు, మూడింతలయ్యాయని ప్రభుత్వం ప్రస్తావించింది. నవంబర్‌ మూడున అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయానికి 97లక్షల కేసులుండగా.... ప్రస్తుతం 2 కోట్ల 21 లక్షలు దాటేశాయని పేర్కొంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గౌరవమిస్తుందని తెలిపింది. ప్రజల జీవితాన్ని, స్వేచ్ఛను కాపాడే బాధ్యత తమపై ఉందని.... వ్యాక్సినేషన్‌ ప్రక్రియ... ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న అతిపెద్ద కార్యక్రమమని ప్రభుత్వం వివరించింది. ప్రజారోగ్యం, ప్రజాహితాన్ని పరిగణనలోకి తీసుకుని..... ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోర్టును ప్రభుత్వం కోరింది. ఎన్నికల నిర్వహణకు జారీ చేసిన ఉత్తర్వులు సస్పెండ్ చేయాలని అభ్యర్థించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో SEC నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌, కేంద్ర ఆరోగ్య, హోంశాఖలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.  

ఇదీ చదవండి

4 దశల్లో పంచాయతీ ఎన్నికలు..షెడ్యూల్‌ విడుదల

Last Updated : Jan 10, 2021, 2:53 AM IST

ABOUT THE AUTHOR

...view details