‘కరోనాపై ఆందోళన వద్దు, వైద్య నిపుణుల సలహాలు, సూచనలను కచ్చితంగా పాటించాలి. ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించండి’ అని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజ్ఞప్తి చేశారు. వైద్యపరంగా ఎంతో ముందున్న దేశాలు సైతం కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఇబ్బందిపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ మహమ్మారి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయని తెలిపారు.
కరోనా బాధితులు భయపడాల్సిన అవసరం లేదని, చికిత్సకు అన్ని వైద్య సదుపాయాలను ప్రభుత్వం సిద్ధం చేసిందని వివరించారు. మానవ నైపుణ్యం, చాతుర్యం, ఆవిష్కరణ సామర్థ్యం.. త్వరలోనే కొవిడ్-19కు పరిష్కారాన్ని చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో మొదటి వరుసలో ఉండి సేవలందిస్తున్న వైద్యులు, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన రెడ్‌క్రాస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వ్యక్తులకు అభినందనలు తెలిపారు.