భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలిన ఘటన పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కోయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. 14 మందికి గానూ 13 మంది మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.
తీవ్ర విచారకరం - సీఎం జగన్
Cm jagan Tributes to CDS Bipin Rawat: బిపిన్ రావత్ మృతి పట్ల సీఎం జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ప్రమాద ఘటన తీవ్ర విచారకరమన్నారు.
తీరని లోటు - చంద్రబాబు
chandrababu Tributes to CDS Bipin Rawat: హెలికాప్టర్ ఘటన తెదేపా అధినేత చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బిపిన్ రావత్ మృతి సైన్యానికి తీరని లోటు అని అన్నారు. సాయి తేజ కుటుంబానికి అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సీడీఎస్ బిపిన్ రావత్ మృతి రక్షణశాఖకు తీరని లోటు అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
దిగ్భ్రాంతి కలిగించింది - పవన్
pawan Tributes to CDS Bipin Rawat; బిపిన్ రావత్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రావత్ మృతి దేశానికి తీరని లోటు అన్న పవన్.. సంతాపం వ్యక్తం చేశారు. ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ ఉన్నారని తెలిసి చాలా బాధపడినట్లు పేర్కొన్నారు. తన తరఫున, జనసేన పక్షాన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
ఏం జరిగిందంటే..
హెలికాప్టర్ ఘటనలో.. ఏం జరిగిందంటే
Bipin Rawat passed away: హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న Mi-17V5 చాపర్ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగానూ 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.
లెక్చర్ ఇచ్చేందుకు వెళ్లి..
కోయంబత్తూర్ సమీపంలోని సూలూర్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన Mi-17V5 చాపర్.. కూనూర్ సమీపంలోని కట్టేరి- నాంచప్పనంచథ్రం వద్ద మధ్యాహ్నం 12.20-12.30 గంటల ప్రాంతంలో కూలిపోయింది. జనరల్ రావత్.. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ స్టాఫ్ కాలేజ్‌లో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పొగమంచుతో వెలుతురు సరిగా లేకపోవడమే.. ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. చాపర్.. నివాస ప్రాంతాలకు కాస్త దూరంగా కూలిపోవడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పింది. ఘటన సంబంధిత దృశ్యాలు.. భయానకంగా ఉన్నాయి. హెలికాప్టర్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది.బిపిన్ రావత్ మృతిపట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తో పాటు రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. రావత్ సేవలను గుర్తు చేసుకున్నారు.
మృతుల్లో చిత్తూరు జిల్లావాసి
IAF Chopper Crash: తమిళనాడులోని కూనురులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఏపీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం ఎగువరేగడ గ్రామవాసి సాయితేజ్ ఈ ప్రమాదంలో మృతి చెందాడు. లాన్స్ నాయక్‌గా ఉన్న సాయితేజ్.. సిడిఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
ఆర్మీ సిఫాయిగా చేరి..
సాయితేజ్.. 2013లో ఆర్మీ సిఫాయిగా చేరారు. సిఫాయిగా పని చేస్తూ ఏడాది తర్వాత పరీక్షలో ఉత్తీర్ణుడై పారా కమెండోగా ఎంపికయ్యారు. లెవెన్త్ పారాలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. బెంగళూరులో సిఫాయిలకు శిక్షకుడుగా పని చేసిన సాయితేజ్.. ప్రస్తుతం బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సాయితేజ్‌కు భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞ, కూతురు దర్శిని ఉన్నారు. వీరి కుటుంబం గత ఏడాదిగా మదనపల్లె ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటుంది. ఇవాళ ఉదయం 8:15కు సాయితేజ్ ఓ సారి ఫోన్ చేశారని.. 8:45 వీడియో కాల్ చేసి పిల్లలతో మాట్లాడారని కుటుంబసభ్యులు తెలిపారు. సాయితేజ్ మరణంతో.. గ్రామంలో విషాదం నెలకొంది.
ఇదీ చదవండి:
IAF Chopper Crash: హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లావాసి మృతి