అటానమస్ స్టేటస్ పేరుతో కొన్ని కళాశాలలు అక్రమాలకు పాల్పడ్డట్టు ఫిర్యాదులు వచ్చాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. వివిధ వర్సిటీల పరిధిలో 109 అటానమస్ కళాశాలలు ఉన్నాయన్న మంత్రి సురేశ్... సిలబస్, ప్రశ్నాపత్రాలు, మూల్యాంకనం ఆయా వర్సిటీలే చేస్తాయని స్పష్టం చేశారు. కొన్ని అటానమస్ కళాశాలలు రాయితీలు పొందుతున్నాయని.. అటానమస్ ముసుగులో కొన్ని కళాశాలలు నాణ్యత లేని విద్యను అందించాయని వ్యాఖ్యానించారు.
యూజీసీ ఆమోదం ఉందని ఎవరైనా కోర్టుకు వెళ్తే వెళ్లవచ్చని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు. విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉందని.. రాష్ట్రమూ చట్టాలు చేయవచ్చని పేర్కొన్నారు. అటానమస్ కళాశాలలపై యూజీసీతోనూ సంప్రదింపులు జరుపుతామన్న సురేశ్... యూజీసీ ఆమోదం ఉందంటే కుదరదు.. కాలేజీలు రాష్ట్రంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని అటానమస్ కళాశాలల్లో అకాడమిక్ ఆడిట్ చేపడతామని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు.