పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపటంతో ఆగ్రహం చెందిన వైకాపా సర్కారు... మండలిని రద్దు చేసేందుకే మొగ్గుచూపుతోంది. మండలిలో మెజారిటీ లేకపోవటంతో శాసనసభలో ఆమోదించిన బిల్లులు మండలిలో ఆమోదం పొందలేకపోతున్నాయి. బిల్లులు తిప్పి పంపడం, జాప్యం చేయడం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండలి రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో ముఖ్యనేతలు, న్యాయ నిపుణులతోనూ చర్చించిన జగన్.. మండలిపై వేటు వేయాలని దాదాపు నిర్ణయించుకున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటివరకు మండలి రద్దు చేస్తామని అధికారికంగా చెప్పకపోయినా... రద్దుకే సీఎం మొగ్గు చూపుతున్నట్లు వైకాపా నేతలు స్పష్టం చేశారు. పార్టీకి నష్టం జరుగుతుందని పలువురు స్పష్టం చేసినా సీఎం రద్దుకే నిశ్చయించినట్లు చెబుతున్నారు.
ఆకర్ష ఫలించలేదా?
ప్రజాభిప్రాయానికి, చట్ట సభల నిబంధనలకు ప్రజల శాసన సభలకు వ్యతిరేకంగా పనిచేస్తోన్న శాసన మండలి అవసరమా అంటూ ఇటీవలే ముఖ్యమంత్రి శాసనసభలో వ్యాఖ్యానించారు. శాసన మండలిలో జరిగిన పరిణామాలను వివరిస్తూ మండలి రద్దుపై మంత్రుల అభిప్రాయాలను గురువారం తీసుకున్నారు. అనంతరం 3 రోజులు గడువిస్తూ సోమవారానికి శాసన సభను వాయిదా వేశారు. ఆ తరువాత తెదేపా ఎమ్మెల్సీలను రాబట్టుకునేందుకు వైకాపా నేతలు పలు రకాలుగా ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సజ్జల వ్యాఖ్యలతో బలం