AP News: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఖాళీ ఖజానాతో అడుగుపెట్టిన ప్రభుత్వం మొదటి రోజు నుంచే రుణ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ దిశగా.. బహిరంగ మార్కెట్ రుణానికి (ఓఎంబీ) కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతుల కోసం ఎదురు చూస్తోంది. ఏ మూల ఏ నిధులున్నాయో వెతికి ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజుల బిల్లుల చెల్లింపులకు వాడుకుంది. చేబదుళ్ల అవకాశాలతో పాటు.. పంచాయతీల నిధులనూ వినియోగించుకున్నట్లు విశ్వసనీయవర్గాల కథనం. మొత్తం మీద దాదాపు రూ.2,816 కోట్ల చేబదుళ్లతో కొత్త సంవత్సరంలోకి రాష్ట్రం అడుగుపెట్టింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.79,454.31 కోట్ల స్థూల రుణ పరిమితి ఉండొచ్చని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు వేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.12,01,736 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో 3.5% బహిరంగ మార్కెట్ రుణ పరిమితిగా తీసుకుంటే రూ.42,060.76 కోట్లు. గతంలో తిరిగి చెల్లించిన రూ.16వేల కోట్ల రుణాలను దీనికి కలపాలని ప్రభుత్వం అంటోంది. ఇక జీఎస్‌డీపీలో 0.5% మూలధనవ్యయ పరిమితితో అనుసంధానించిన రుణం రూ.6,008.68 కోట్లుగా తేల్చింది.
ఇవేకాక ప్రభుత్వం కొత్త వాదన వినిపిస్తోంది. 2005-06 నుంచి 2013-14 మధ్య రాష్ట్రానికి ఉన్న బహిరంగ మార్కెట్ రుణ పరిమితి రూ.26,380.10 కోట్లని, నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ వాటా 58.32%గా లెక్కిస్తే ఆ మొత్తం రూ.15,384.87 కోట్లని అంచనా వేస్తోంది. ఇవన్నీ కలిపి మొత్తం రూ.79,454.31 కోట్లు స్థూల రుణ పరిమితిగా ప్రభుత్వం లెక్కించింది. ఇందులో నాబార్డు రుణాలు, పీఎఫ్, ఇతర ప్రజాపద్దు, విదేశీ రుణాలను మినహాయించి నికర రుణ పరిమితిని రాష్ట్రం రూ.71,876.02 కోట్లుగా లెక్కించినట్లు తెలిసింది. కొత్త రుణాలకు ప్రతిపాదిస్తూ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్ర ఆర్థికశాఖలోని వ్యయ నియంత్రణ విభాగం అన్నీ పరిశీలించి రుణ పరిమితిని లెక్కించి తొలి 9 నెలలకు అనుమతులిస్తుంది. ఇందుకు ఆలస్యమయ్యేట్లయితే తొలుత ఏప్రిల్ నెల వరకు కొంత మేర రుణ అనుమతులు లభిస్తాయి.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెల మొదటి అవసరాలు తీర్చుకోవాలన్నా రుణాలకు వెళ్లక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లకే రూ.5,500 కోట్లవుతుంది. పేరోల్ వెబ్ సమస్య వల్ల జీతాలు ఆలస్యమవుతున్నాయని చెప్పినా.. నిధులు లేకపోవడమూ సమస్యేనన్నది ఆర్థికాంశాల్లో అనుభవమున్న వారి మాట. ఉద్యోగులకు మార్చి జీతాలు చెల్లించేందుకు కొంత సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి:ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు తుది నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం