Dulhan scheme: ముస్లింల అభ్యున్నతికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన.. రెండు పథకాలు అమలు చేయలేమని వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసింది. దుల్హన్, విదేశీ విద్యా పథకాలను.. నిధుల కొరత కారణంగా అమలు చేయడం లేదని హైకోర్టుకు తెలిపింది. దుల్హన్ పథకాన్ని లక్ష రూపాయలు చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చిన సీఎం జగన్.. ముస్లింలకు ధోకా ఇచ్చారని.. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి విమర్శించింది.
డబ్బుల్లేవ్.. "దుల్హన్" పథకం నిలిపేస్తున్నాం: జగన్ సర్కారు - దుల్హన్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన
11:34 June 23
హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
నిరుపేదల ముస్లిం యువతులకు వివాహం సందర్భంగా ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన దుల్హన్ పథకాన్ని నిలిపేసినట్లు.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. పథకం అమల్లో లేదని పేర్కొంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దుల్హన్ కింద పేద ముస్లిం మహిళల వివాహానికి 50వేలు చొప్పున అందజేశారు. అధికారంలోకి వస్తే దుల్హన్ కింద యువతులకు లక్ష ఇస్తామని.. పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఆర్థిక సాయం పెంపు లేకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన 50 వేల రూపాయలూ అందించలేదు. ఈ పథకం నిలిపివేయడాన్ని.. సవాల్ చేస్తూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు షారూఖ్ షిబ్లి హైకోర్టులో వాజ్యం దాఖలు చేశారు. ఐతే ఆర్థిక ఇబ్బందుల వల్లే.. పథకం అమలు చేయలేకపోతున్నట్లు ప్రభుత్వ న్యాయవాది తెలుపగా.. అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.
దుల్హన్ పథకంతోపాటు విదేశీ విద్య పథకం నిలిపివేతపైనా.. 2021లో షిబ్లి వాజ్యం వేశారు. మైనారిటీలకు ఉన్నత విద్య కోసం గత ప్రభుత్వ హయాంలో 15 లక్షలు రూపాయల వరకు ఆర్థిక సాయం అందేది. వైకాపా అధికారంలోకి వచ్చాక సాయం అందకపోగా.. 2018, 19 ఆర్థిక సంవత్సరాల్లో విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించిన... 574 మందికి కూడా సాయం విడుదల చేయడం లేదని.. పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. దీనికీ నిధులు లేవని ప్రభుత్వ న్యాయవాది తెలుపగా.. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది.
ముస్లింల సంక్షేమంలోనూ వైకాపా ప్రభుత్వం కోతపెట్టిందన్న పిటిషనర్.. ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: