కరోనా పరీక్షల ఫలితాలు ఆలస్యమవుతున్న ఘటనలపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలోని అన్ని వీఆర్డీఎల్ ల్యాబ్ లు, ట్రూనాట్ ల్యాబ్ లలో నమునా సేకరణ కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నమూనా సేకరణ కౌంటర్లూ మూడు షిఫ్టులూ పనిచేసేలా చూడాలని జిల్లా జేసీలను ఆదేశించింది. ల్యాబ్ లలో సేకరించిన నమూనాల ఫలితాలు వచ్చిన వెంటనే కోవిడ్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచనలు జారీ చేసింది.
కోవిడ్ ప్రోటోకాల్ ను అనుసరించి నమూనాలను జాగ్రత్త చేయాలని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఐడీ నెంబరు, సరైన మూత లేకుండా లేకుండా నమూనాల సేకరణ, బాక్సింగ్ లాంటి విధానాలు పాటించకుండా నిర్ధరణ పరీక్షలు చేసేందుకు వీల్లేదని ఆదేశించింది. సదరు ఫలితాలను ఎంఎస్ఎస్ కోవిడ్ పోర్టల్లో నమోదు చేయకుండా తిరస్కరించాలని సూచించింది. రెడ్ మార్కింగ్ చేసిన నమూనాలను ప్రాధాన్యతగా గుర్తించి తక్షణం ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.