రాష్ట్రంలో కొత్తగా చేపట్టనున్న 5 సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక సంస్థ (స్పెషల్ పర్సస్ వెహికల్-ఎస్‌పీవీ) ద్వారా నిధులు సమీకరించాలని ప్రభుత్వం విధానంగా ఎంచుకుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా ప్రాంతాల్లో రూ.లక్ష కోట్లకుపైగా విలువైన కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు జలవనరులశాఖ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి స్థాయిలో వివిధ సందర్భాల్లో వీటిపై చర్చించారు. కొన్ని ప్రాజెక్టులకు జలవనరులశాఖ పాలనామోదం కూడా ఇచ్చింది.
ప్రస్తుతం రాయలసీమ కరవు నివారణ పథకం కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేసి ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి నిధులను సమీకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు చేరాయి. లోగడ జలవనరులశాఖ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలను సమీకరించారు. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టులు సాకారం కావాలంటే సులభతరంగా రుణాలు పొందాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటుచేసి వాటిద్వారా ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చారు.
రాయలసీమ కరవు నివారణ పథకం, ఇతర ప్రాజెక్టులతోపాటు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, పల్నాడు కరవు నివారణ పథకం, కృష్ణాపై బ్యారేజీలు.. కొల్లేరు- కృష్ణా మధ్య ఉప్పునీటి నివారణ పనులు, గోదావరి నుంచి బనకచర్లకు నీటి మళ్లింపులో భాగంగా కృష్ణా వరకు నీటిని తెచ్చే పథకం ఈ ఐదింటిలో ఉన్నాయి. ఎస్‌పీవీలను కంపెనీ చట్టం కింద లేదా సొసైటీ చట్టం కింద ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఈ సంస్థల రుణ సమీకరణకు ప్రభుత్వం గ్యారంటీనివ్వాల్సి ఉంది.