గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా ప్రభుత్వం గుర్తించింది. మహిళా పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో జారీ చేసిన దాని స్థానంలో కొత్తగా ఇచ్చిన ప్రస్తుత నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని హోంశాఖ తెలిపింది. మొత్తం ఐదు కేటగిరీల మహిళా పోలీసు ఉద్యోగులను నియమించాలని నిర్ణయించిన సర్కార్.. ఏపీ పోలీసు రిక్రూట్‌మెంటు బోర్డు ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.
గ్రామ, వార్డు సచివాలయ సంరక్షణా కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం నూతన నోటిఫికేషన్ వెలువరించింది. ఈ మేరకు మహిళా పోలీసు విభాగంలో పోస్టుల కేటగిరీతో పాటు సర్వీసు నిబంధనలు, నియామక నిబంధనల్ని ప్రకటించింది. ఐదు కేటగిరీలుగా మహిళా పోలీసు విభాగంలో పోస్టులు ఉంటాయని స్పష్టం చేసింది. మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ (నాన్ గెజిటెడ్), మహిళా పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్, మహిళా పోలీసు ఏఏస్ఐ, సీనియర్ మహిళా పోలీసు, మహిళా పోలీసుగా.. ఉద్యోగ కేటగిరీలను ప్రభుత్వం ఖరారు చేసింది.
90 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్
90 శాతం మేర డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తామని మహిళా హోంగార్డులను 5 శాతం, గ్రామవార్డు మహిళా వాలంటీర్ల నుంచి 5 శాతం మందిని మహిళా పోలీసు విభాగంలో భర్తీ చేస్తామని హోంశాఖ స్పష్టం చేసింది.
రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా ప్రత్యక్ష భర్తీ
మహిళా పోలీసు విభాగంలో చేరేందుకు ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా రాతపరీక్ష, దేహధారుడ్య పరీక్షలు నిర్వహించనున్నారు. మహిళా పోలీసు విభాగానికి ఎంపికయ్యే అభ్యర్ధులు 28 ఏళ్లలోపు ఉండాలని. కనీసం 5 అడుగుల ఎత్తు, 40 కేజీల బరువు ఉండాలని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. 20 నిముషాల్లో రెండు కిలోమీటర్ల నడక, 200 మార్కులకు నిర్వహించే రాతపరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. మహిళా పోలీసుగా ఎంపికైన అభ్యర్ధులు రూ. 5 వేల సెక్యూరిటీ బాండ్‌తో పాటు కనీసం 3 ఏళ్లు పనిచేస్తామన్న హామీ ఇవ్వాలని ఉత్తర్వుల్లో తెలిపింది. నియామకం తర్వాత కనీసం రెండేళ్ల ప్రొబేషన్ కాలం ఉంటుందని స్పష్టం చేసింది.
పోలీసు శాఖకు అనుసంధానంగానే - డీజీపీ
"పోలీసు శాఖకు అనుసంధానంగా మహిళా పోలీస్ వ్యవస్థ ఉంటుంది. ఎస్పీ పర్యవేక్షణలో మహిళా పోలీసుల విధులు నిర్వర్తిస్తారు. మహిళా పోలీసుల పదోన్నతుల కోసం ప్రత్యేక పోస్టులు ఉంటాయి. వీరు 24 గంటలూ పని చేయనక్కర్లేదు. మొదటి 3 నెలలు పోలీస్ కళాశాలలో శిక్షణతో పాటు.. మరో నెల రోజులు మహిళా క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తాం"- గౌతమ్ సవాంగ్, డీజీపీ
ఇదీ చదవండి:'మీరు రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారు.. సినీ పరిశ్రమపై ఏపీ నేతల వ్యాఖ్యలకు తమ్మారెడ్డి కౌంటర్