పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా పడకేయడంతో ఆ వైఫల్యాన్ని ఎవరో ఒకరి ఖాతాలో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. మొన్నటి వరకు పాత ప్రభుత్వానిదే తప్పని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాజాగా ఆ నెపాన్ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సంస్థలపైకి నెట్టేస్తోంది. అధికారిక అంశాలను కూడా వక్రీకరిస్తూ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
2019 మే నెలాఖరులో వైకాపా ప్రభుత్వం ఏర్పడే నాటికి పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణ పని 64 శాతం జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వ అధికారిక గణాంకాలే తెలియజేస్తున్నాయి. 2022 మే నెల నాటి నివేదికల ప్రకారం పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణం 76.39 శాతం పూర్తయింది. అంటే ఈ మూడున్నరేళ్లలో జరిగిన పని కేవలం 12 శాతమే. ప్రస్తుతం పోలవరంలో పనులు ఆగిపోయాయి. దిగువ కాఫర్ డ్యాం సకాలంలో నిర్మించి ఉంటే వరద ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగించే అవకాశం ఏర్పడేది. దిగువ కాఫర్ డ్యాం సకాలంలో నిర్మించలేకపోయారని పోలవరం అథారిటీయే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. మరోవైపు ప్రధాన డ్యాం నిర్మించే చోట పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఎగువ కాఫర్ డ్యాంలో గ్యాప్‌లు సకాలంలో పూడ్చి ఉంటే ఇంత పెద్ద సమస్య ఏర్పడి ఉండేది కాదని తృతీయ పక్షంగా ఉన్న హైదరాబాద్ ఐఐటీ నిపుణులు తేల్చారు. స్పిల్ వే పూర్తి చేయకుండా ఎగువ కాఫర్ డ్యాం నిర్మించడం వల్లే పోలవరంలో సమస్యలు ఎదురయ్యాయని, ఇందుకు చంద్రబాబు ప్రభుత్వమే కారణమని వైకాపా ప్రభుత్వ పెద్దలు ఇన్నాళ్లూ విమర్శిస్తూ వచ్చారు. తాజాగా పోలవరం అథారిటీ, హైదరాబాద్ ఐఐటీ పోలవరం వైఫల్యాలకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ తీరే కారణమని కుండబద్దలు కొట్టాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఐఐటీ నివేదికను తప్పుపడుతోంది. ఐఐటీ తప్పుబట్టిన అన్ని అంశాలకు కేంద్రానిదే తప్పంటూ వేలెత్తి చూపుతోంది. పోలవరం ఎస్‌ఈ కేంద్రాన్ని తప్పుపడుతూ అధికారికంగా వివరణ పంపడం ఇప్పుడు చర్చనీయాంశమయింది.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమంది?: "చంద్రబాబు ప్రభుత్వం స్పిల్ వే పూర్తి చేయకుండా ఎగువ కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టడంవల్లే పోలవరంలో సమస్యలు తలెత్తాయి. అందువల్లే ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోయింది."- సీఎం, జలవనరులశాఖ మంత్రి
కేంద్ర సంస్థలదే తప్పిదం
హైదరాబాద్ ఐఐటీ నివేదికపై పోలవరం ఎస్‌ఈ నరసింహమూర్తి తాజాగా పత్రికలకు వివరణ పంపారు. అందులో ఆయన ఏమన్నారంటే..
*పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాంలలో మిగిలిన గ్యాప్‌లను పూడ్చకూడదని పోలవరం అథారిటీ 2019 మే 31న నిర్ణయం తీసుకుని, పనులు నిలిపేయాలని ఆదేశించింది. అదే ఏడాది జూన్‌లో జరిగిన డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్‌పీ) 13వ సమావేశంలో అథారిటీ నిర్ణయాన్ని ధ్రువీకరించారు. +35 మీటర్ల వరకు పునరావాస పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నందున మిగిలిన ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు నిలిపివేశాం. పోలవరం అథారిటీ 2020 ఏప్రిల్ 12న అత్యవసర సమావేశం నిర్వహించి +35 మీటర్ల వరకు ఆర్‌అండ్‌ఆర్ పనులు పూర్తి కానందున కాఫర్ డ్యాం మిగిలిన గ్యాప్ పనులు చేపట్టవద్దని సూచించింది. అందువల్ల 2020లో వాటిని చేపట్టలేదు.
*రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సూచన మేరకు పోలవరంలో టెండర్లు పిలిచి గుత్తేదారును మార్చాం.
*పోలవరానికి కీలకమైన ఆకృతుల ఆమోదం, రాష్ట్రం ఖర్చు చేసిన నిధులను సకాలంలో తిరిగి చెల్లించడం కేంద్రం ప్రధాన బాధ్యతలు. వీటిలో జాప్యాన్నే ఐఐటీ హైదరాబాద్ నివేదికలో ప్రణాళికా వైఫల్యంగా ప్రస్తావించింది.
*వివిధ సంస్థల్లో సమన్వయ లోపం ఉందని ఐఐటీ నివేదిక ప్రస్తావించింది. కేంద్ర జల్‌శక్తి, ఆర్థిక, గిరిజన సంక్షేమ, అటవీ పర్యావరణ శాఖలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సీఎస్‌ఎంఆర్‌ఎస్, వాప్కోస్, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ, నిపుణుల కమిటీ వంటి వాటితో సమన్వయం చేసుకోవాల్సి ఉంది.
పోలవరం అథారిటీ ఏం చెప్పింది?
నిజానికి పోలవరం అథారిటీ ఎగువ కాఫర్ డ్యాంలో గ్యాప్‌లు పూడ్చవద్దని చెప్పలేదు. 2019 మే నాటికి పునరావాసం పూర్తి కానందున ఆ వరదల సీజన్ వరకు మాత్రమే గ్యాప్‌లు అలా వదిలేయాలని సూచించింది. 2020 ఏప్రిల్ 21న జరిగిన సమావేశంలో +35 మీటర్ల వరకు పునరావాసం పూర్తి కానందున కాఫర్ డ్యాం మిగిలిన గ్యాప్‌లను చేపట్టరాదని పోలవరం అథారిటీ సూచించిందని, అందువల్ల 2020లో మిగిలిన కాఫర్ డ్యాం పని చేపట్టలేదని ఎస్‌ఈ వివరణ ఇచ్చారు. 2019 జూన్‌లో కొత్త ప్రభుత్వం వస్తే 2020 ఏప్రిల్ వరకు +35 మీటర్ల వరకు పునరావాసం పూర్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆ పనులు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఆ వైఫల్యాన్ని బయటపెట్టకుండా పోలవరం అథారిటీ గ్యాప్‌లు పూడ్చవద్దని చెప్పినందునే 2020లో ఆ పనులు చేయలేదని తేల్చి చెప్పేశారు.