ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 29, 2019, 7:14 AM IST

Updated : Dec 29, 2019, 7:51 AM IST

ETV Bharat / city

అమరావతిలో నిర్మాణాలకు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా..?

రాష్ట్ర రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దే క్రమంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 10వేల కోట్లకు పైగానే ఖర్చుచేసింది. మంత్రులు, అధికారులు రాజధాని పనుల నిమిత్తం వివిధ దేశాల్లో చేసిన పర్యటనలు, నిర్వహించిన సదస్సులు, సమావేశాలు, అధ్యయనాల కోసం చేసిన ఖర్చు కలిపితే ఇది మరింత పెరుగుతుంది.

అమరావతిలో నిర్మాణాలకు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా..?
అమరావతిలో నిర్మాణాలకు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ఒక మహానగరంగా నిర్మించాలని తలపెట్టినప్పటి నుంచి.. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లకుపైగానే వెచ్చించింది. అమరావతిని కేవలం ఒక పరిపాలనా నగరంగా కాకుండా, ఆర్థిక కార్యకలాపాలకు, సంపద సృష్టికి కేంద్రంగా, ఉపాధి అవకాశాలకు నిలయంగా చేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను రూపొందించింది. 2050 నాటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికలను సిద్ధం చేసింది. కీలకమైన ప్రణాళికలు, ఆకృతుల రూపకల్పన ప్రక్రియలు ఇప్పటికే పూర్తయి, పనులు కూడా కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు రాజధానిని మరో చోటుకి మార్చడం వల్ల... ఇంతవరకు పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

మౌలిక వసతుల కల్పనకు

ఈ వ్యయంలో... ప్రణాళికల రూపకల్పన, మౌలిక వసతుల అభివృద్ధి, భవన నిర్మాణాలు, పనులకు ఇంకా చెల్లించాల్సిన బిల్లులు, భూములిచ్చిన రైతులకు చెల్లించిన కౌలు, భూమిలేని పేదలకు ప్రతి నెలా ఇస్తున్న పింఛన్లు, రాజధాని రైతులకు రుణ ఉపశమనం, నిమ్మ, మల్లె తోటలు వంటి వాణిజ్య పంటలకు ఇచ్చిన పరిహారం, వైకాపా అధికారంలోకి రాగానే కూల్చేసిన ప్రజావేదిక నిర్మాణానికి అయిన ఖర్చు వంటివన్నీ ఉన్నాయి. మంత్రులు, అధికారులు రాజధాని పనుల నిమిత్తం వివిధ దేశాల్లో చేసిన పర్యటనలు, నిర్వహించిన సదస్సులు, సమావేశాలు, అధ్యయనాల కోసం చేసిన ఖర్చు కలిపితే ఇది మరింత పెరుగుతుంది.

ఖర్చు చేసింది ఇలా..!

  • వివిధ దశల్లో మొత్తంగా రూ.1,09,023 కోట్లు ఖర్చవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది. దశల వారీగా చేయాల్సిన ఖర్చు ఇది. ప్రధాన మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ భవనాల నిర్మాణం, రైతులకు ఫ్లాట్లు ఇచ్చిన లేఅవుట్‌లలో వసతుల అభివృద్ధికి తొలిదశలో రూ.52,837 కోట్లు ఖర్చవుతుంది.
  • సీఆర్‌డీఏ లెక్కల ప్రకారం... ఇంతవరకు రూ.42,170కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. వాటిలో ఇప్పటికే పూర్తయిన, ప్రారంభమైన పనులు రూ.41,677 కోట్లు. చెల్లించిన బిల్లులు రూ.5,674 కోట్లు ఉండగా... ఇంకా చెల్లించాల్సిన బకాయిలు రూ.1,800 కోట్ల వరకు ఉంది.
  • కొండవీటివాగు ఎత్తిపోతల పథకానికి రూ.250 కోట్లు, టిడ్కో ద్వారా పేదలకు గృహ నిర్మాణానికి రూ.305 కోట్లు ఖర్చు చేసింది. అంటే రాజధానిలో భౌతికంగా జరిగిన పనుల విలువ రూ.8 వేల కోట్లకుపైగానే ఉంది.

ఆ ఖర్చూ కలిపితే..!

భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తొలి సంవత్సరంలో మెట్ట భూములకు ఎకరానికి రూ.30వేలు, జరీబు భూములకు ఎకరానికి రూ.50వేలు చొప్పున కౌలు చెల్లించింది. ఏటా 10శాతం చొప్పున కౌలు పెంచుతోంది.

  • రాజధానిలో భూమిలేని పేదలకు నెలకు రూ.2,500 చొప్పున తొలి ఏడాది పింఛను చెల్లించింది. అది కూడా ఏటా 10శాతం పెంచుతూ వస్తోంది.
  • కౌలు, పింఛన్లు, రుణవితరణ, సామాజిక వసతులు వంటివన్నీ కలిపి సుమారు రూ.1,300కోట్లు ఖర్చు చేసింది.
  • ప్రణాళికలు, డిజైన్లు రూపొందించిన ఆర్కిటెక్చర్‌, కన్సల్టెన్సీ సంస్థలకు మరో రూ.400కోట్లకుపైగా ఖర్చయింది.
  • తెచ్చిన రుణాలపై వడ్డీల చెల్లింపులు, ఇతర ఖర్చులన్నీ కలిపితే ఈ మొత్తం రూ.10వేల కోట్లు దాటుతుందనిఅంచనా.

ఇప్పటికే పూర్తయి, కార్యకలాపాలు కొనసాగుతున్న నిర్మాణాలు

  • కొండవీటివాగు వల్ల రాజధానికి వరద ముంపు లేకుండా నివారణకు ఎత్తిపోతల పథకం.
  • వెలగపూడిలోని ప్రస్తుత సచివాలయం, శాసనసభ భవనాలు: మొత్తం 6.20 లక్షల చ.అడుగులు.
  • జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌: 2.5 లక్షల చ.అడుగులు.
  • తుళ్లూరులో సీఆర్‌డీఏ కార్యాలయ భవనం.
  • రూ.7.59కోట్లతో ప్రజావేదికను నిర్మించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు దీనిని కూల్చేశారు.

నిర్మాణంలో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టులు

  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ అధికారులు, నాలుగోతరగతి ఉద్యోగులకు అపార్ట్‌మెంట్ల నిర్మాణం. ఇవన్నీ 55 నుంచి 90శాతం వరకు పూర్తయ్యాయి.
  • మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్‌ అధికారులకు బంగ్లాల నిర్మాణాలు 30శాతం పూర్తయ్యాయి.
  • సీఆర్‌డీఏ ప్రాజెక్టు ఆఫీస్‌, ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌.
  • ప్రధాన రహదారులు, బ్రిడ్జిలు, ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌లలో మౌలికవసతుల అభివృద్ధి, శాఖమూరు పార్కు నిర్మాణం పనులు మొదలయ్యాయి.
  • సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల టవర్లకు సంబంధించి ప్రధాన స్ట్రక్చర్‌ నిర్మాణం మొదలయ్యాక పనులు నిలిపివేశారు.
  • హైకోర్టు భవన నిర్మాణానికి పునాదులు వేశారు.

ఇవీ చూడండి

'అమరావతే రాజధానిగా ఉండాలి.. అంతవరకూ ఆందోళనలే..!'

Last Updated : Dec 29, 2019, 7:51 AM IST

ABOUT THE AUTHOR

...view details